తెలుగుదేశం పార్టీ నేత , మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనాత్మకం అవుతోంది. ఆయనపై హత్యాయత్నం కేసు పెట్టారు. అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. ఆయన కొండపల్లి అడవుల్లో జరుగుతున్న మైనింగ్‌ను పరిశీలించడానికి వెళ్లడం వల్ల ఉద్రిక్తతలు తలెత్తాయని .. శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని పోలీసులు చెబుతున్నారు. అయితే అక్రమ మైనింగ్‌ చేస్తున్న వారిపై కేసులు పెట్టాల్సిన పోలీసులు ... అవినీతిపై పోరాడిన వారిపై కేసులు పెడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు ఈ వివాదం మొత్తం కొండపల్లి కొండలపై జరుగుతున్న మైనింగ్ కారణం అని చెప్పుకోవచ్చు. 
 
కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్..! విచారణ కమిటీ నిర్ధారణ..! 


కృష్ణా జిల్లా కొండపల్లిలో రక్షిత అటవీ ప్రాంతం ఉంది. అక్కడ మైనింగ్‌కు ఎలాంటి అనుములు ఇవ్వరు. అయితే అక్కడ అక్రమంగా గ్రావెల్ తవ్వుతున్నారని టీడీపీ నేతలు కొంత కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. స్థానికులు కూడా అదే పనిగా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో అటవీ శాఖ అధికారులు గత ఏడాది ఆగస్టు ప్రారంభంలో తనిఖీలు చేశారు. అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తున్నట్లుగా గుర్తించారు. పలు వాహనాలను సీజ్ చేసి..తవ్వాకలను నిలిపివేశారు. అయితే ఎలాంటి కేసులు పెట్టలేదు. అక్రమ మైనింగ్‌పై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ పరిశీలన చేసి నివేదిక అందజేసింది. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఖచ్చితంగా అక్రమ మైనింగ్ జరిగిందని అధికారులు తేల్చారు. ఆ నివేదిక ప్రభుత్వం వద్ద ఉంది.


చర్యలు తీసుకోని ప్రభుత్వం..! 


కమిటీ నివేదిక ఇచ్చినా ఇప్పటి వరకు చర్యలు మాత్రం తీసుకోలేదు. పైగా ఒక్క రోజులోనే స్వాధీనం చేసుకున్న వాహనాలను కేవలం రూ. పదివేల పూచికత్తు తీసుకుని వదిలేశారు. తీవ్రమైన విమర్శలు రావడంతో.. చివరికి జిల్లా అటవీశాఖ అధికారిపై చర్యలు తీసుకున్నారు. కానీ అక్రమ మైనింగ్ పాల్పడిన వారిపై మాత్రం కేసులు వేయలేదు.  సాధారణంగా అటవీప్రాంతంలో తవ్వకాలు జరిపితే, ఎంత విలువైన సంపదను తరలించుకుపోయారో గుర్తించి, అంతకు ఐదు రెట్లు జరిమానాలు వేస్తారు. అటవీ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున గ్రావెల్ తరలించుకుపోయిన ఆరోపణలు ఉన్నాయి. దీంతో.. జరిమానా వందల కోట్లలోనే ఉంటుందన్న అంచనాలు కూడా వచ్చాయి. అప్పట్నుంచి ఆ వ్యవహారాన్ని లో ప్రోఫైల్‌లోనే ఉంచారు. 


ఎమ్మెల్యే బావమరిదిపైనే ప్రధానంగా ఆరోపణలు..! 


ప్రస్తుతం అక్రమ మైనింగ్ జరిగిన ఆ కొండపల్లి ప్రాంతానికి వెళ్లినప్పుడే దేవినేని ఉమపై దాడి జరిగింది. తమపై దాడి చేశారని.. ఆయన ఆందోళనకు దిగితే..  పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఓ ఎమ్మెల్యే బావమరిదిపైనే ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయనే నియోజకవర్గంలో ఇష్టారీతిన అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కూడా అధికారులు స్పష్టమైన నివేదిక ఇచ్చిన తర్వాత అయినా చర్యలు తీసుకోవాల్సి ఉందన్న అభిప్రాయం ప్రజల్లో వినిపిస్తోంది. ఈ అంశాన్ని దేవినేని ఉమ.. తమ పోరాటంతో.. ప్రజల్లో మరింతగా చర్చకు పెట్టారు. ఈ మైనింగ్ వ్యవహారం మరింత దుమారం రేగే అవకాశం కనిపిస్తోంది.