ఆంధ్రప్రదేశ్ ఇంటర్ రిజల్ట్స్‌ బీసీ గురుకు విద్యార్థులు సత్తా చాటారు. మొదటి సంవత్సరంలో 83.04 శాతం, రెండో సంవత్సరంలో 91 శాతం ఉత్తీర్ణత సాధించారు. దీనిపై స్పందించిన ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్‌ కృష్ణ... బిసి గురుకులాల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామ‌నేందుకు ఫ‌లితాలే నిద‌ర్శ‌న‌మ‌న్నారు. మంచి ఫలితాలు సాధించిన సిబ్బందికి, ఉత్తీర్ణులైన విద్యార్థులను మంత్రి ప్రశంసించారు.


వంద శాతం ఉత్తీర్ణత సాధించిన అనకాపల్లి జిల్లా తానాం బాలికల బీసీ జూనియర్ కళాశాల సిబ్బందిని మంత్రి అభినందించారు. ఇంటర్‌ రిజల్ట్స్‌ ప్రకటించిన సందర్భంగా మహాత్మా జ్యోతి రావు ఫూలే ఏ.పి. బీసి సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ఆధ్వర్యంలో 14 ఏపీఆర్జేసీ విద్యార్థుల ఫలితాలను ఆయన వెల్లడించారు. మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు 1,498 మందిలో 1,244 (83.04%) మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరైన 1,336 మందిలో లో 1,212 (91%) మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.


అనకాపల్లి జిల్లా తానాం బీసీ (బాలికల) రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్థులు వంద శాతం, ప్రథమ సంవత్సరం విద్యార్థులు 97% మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి వేణుగోపాల్ వివరించారు. తిరుపతి జిల్లా దొరవారిసత్రం బీసీ రెసిడెన్షియల్ (బాలుర)  జూనియర్ కళాశాలకు చెందిన సీనియర్ ఇంటర్మీడియట్‌ విద్యార్థులు 98.1 శాతం మంది, బాపట్ల జిల్లా నిజాంపట్నం (బాలురు) జూనియర్ కళాశాల ప్రథమ సంవత్సరం విద్యార్థులు 93శాతం మంది ఉత్తీర్ణతతో మెరుగైన ఫలితాలు సాధించారని తెలిపారు.


జ్యోతిబా ఫూలే ఏపి బీసి సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీ ద్వారా విద్యార్ధులకు నాణ్యమైన విద్యతోపాటు, మెరుగైన విద్యాసదుపాయాలు, మౌలిక వసతులను కల్పిస్తున్నామని, ఫెయిల్ అయిన విద్యార్దులకు సప్లిమెంటరీ పరీక్షల్లో మంచి ఫలితాలు కోసం కళాశాలలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయని మంత్రి తెలిపారు. విద్యా వ్య‌వ‌స్ద‌ను ప‌టిష్ట‌ప‌ర‌చేందుకు సీఎం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని వివ‌రించారు. రాబోయే రోజుల్లో ప్రైవేట్‌కు దీటుగా, ప్ర‌భుత్వ కాలేజీలు, పాఠ‌శాల‌లు ఉత్త‌మ‌మ‌ైన ఫ‌లితాల‌ు సాదిస్తాయ‌ని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. త‌ల్లిదండ్రులు కూడ ప్ర‌భుత్వంపై న‌మ్మ‌కంతో త‌మ పిల్ల‌ల‌ను ప్ర‌భుత్వ సంస్ద‌ల్లో చ‌దివించాల‌ని పిలుపు నిచ్చారు. విద్య వ్య‌వ‌స్ద‌ను ప‌టిష్టంగా అమ‌లు చేయ‌టంలో దేశానికి త‌మ ప్ర‌భుత్వం ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు మంత్రి.