తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన తెలంగాణ స్టేట్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (టీఎస్ పీజీఈసెట్‌) - 2021 నోటిఫికేషన్ విడుదల అయింది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం టీఎస్ పీజీఈసెట్ దరఖాస్తు ప్రక్రియ ఎలాంటి అపరాధ రుసుము లేకుండా జూలై 5 వరకు కొనసాగనుంది. ఆలస్య రుసుము రూ.250తో జూలై 15 వ తేదీ వరకు, రూ.1000తో జూలై 22 వరకు, రూ.2500తో జూలై 30 వరకు, రూ.5000తో ఆగస్టు 7 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో తెలిపింది. టీఎస్ పీజీఈసెట్ పరీక్షలను ఆగస్టు 11 నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తామని వెల్లడించింది. దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలోనే స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. మరిన్ని వివరాలకు https://pgecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని అభ్యర్థులకు సూచించింది.  



టీఎస్ పీజీఈసెట్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 12 నుంచి ప్రారంభమైంది. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో దరఖాస్తు గడువును పలుమార్లు పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పేర్కొంది. పీజీఈసెట్ ద్వారా గేట్ జీప్యాట్ విద్యార్థులకు ఎంఈ / ఎంటెక్ / ఎంఫార్మా / ఎంఆర్క్ / గ్రాడ్యుయేట్ లెవల్ ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహిస్తోంది. తెలంగాణ రాష్ట్ర పీజీఈసెట్‌ను 19 (ఫార్మసీతో కలిపి) పేపర్లలో నిర్వహించనున్నారు. అభ్యర్థులు బీటెక్‌లో తాము చదివిన బ్రాంచ్‌ ఆధారంగా సంబంధిత పేపర్లలో పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పిస్తున్నారు. 
ముఖ్యమైన వివరాలు:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (Computer Based Test - CBT) ద్వారా ఎంపిక చేస్తారు. 
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500, ఇతరులు రూ.1000 చెల్లించాలి. 
దరఖాస్తు చివరి తేది: జూలై 5, 2021 (ఆలస్య రుసుము లేకుండా)
వెబ్‌సైట్‌: https://pgecet.tsche.ac.in/ 
టీఎస్ పీజీఈసెట్ పరీక్షల తేదీ: ఆగస్టు 11 నుంచి 14 వరకు 
పరీక్ష విధానం: ఈ పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు (మల్టిపుల్ చాయిస్) ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఉండదు. కటాఫ్ మార్కులు 30గా నిర్ణయించారు. ఎస్సీ / ఎస్టీలకు కటాఫ్ మార్కులు ఉండవు. పరీక్ష రెండు గంటల పాటు నిర్వహిస్తారు. పీజీఈసెట్‌లో అడిగే ప్రశ్నలు అన్నీ కూడా బీటెక్‌ స్థాయిలో ఉంటాయి.  
విద్యార్హతలు: బీటెక్‌ / బీఈ / బీఫార్మసీ / బీఆర్క్‌ కోర్సులు లేదా సంబంధిత పేపర్లకు అర్హతగా నిర్దేశించిన బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సుల్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధించాలి.