అతనో అపరకుబేరుడు. ప్రపంచంలోనే అతి పెద్ద కార్ల కంపెనీ అధినేత. ఒక్క ట్వీట్‌తో కోట్లకు కోట్లు మాయం చేయగలడు. అంగారకునిపై కాలనీలు కూడా కట్టేద్దామనుకున్నాడు. కృత్రిమ మేధస్సుతో వింతలు చేయించగలడు. రెప్పపాటు వేగంలో రయ్.. రయ్‌మని పరిగెత్తే సూపర్ ఫాస్ట్‌ కార్లను తయారుచేయగలడు. బిట్‌కాయిన్‌తో ప్రపంచాన్ని శాసించాలన్నా.. కోతితో వీడియోగేమ్ ఆడించాలన్నా ఆయనకే చెల్లింది. ఆయనెవరో కాదు టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్.



Elon Musk: అంగారకుడిపై అంగడి తెరిచేస్తానంటున్న ఎలన్‌మస్క్.. మస్త్ క్రేజీ కదా..?

ఎలన్ మస్క్ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది హై ఎండ్ టెక్నాలజీ అప్‌డేట్స్. ఎప్పుడూ ఏదోక కొత్త ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. సాంకేతికతలో ఆరు నెలలు, ఒకటి లేదా రెండేళ్ల పాటు కొనసాగే అప్‌డేట్స్‌ను మాత్రమే మనం వింటుంటాం. కానీ మస్క్ మాత్రం చాలా ముందుగా ఆలోచిస్తుంటారు. 10 నుంచి 20 ఏళ్ల తర్వాత జరగబోయే వాటిని కూడా అంచనా వేస్తారు. అలాంటి పెద్ద ప్రాజెక్టులను ఆవిష్కరిస్తుంటారు. ప్రపంచానికి సంబంధించిన కొన్ని రంగాలను పూర్తిగా మార్చేసేలా అతను ఆవిష్కరణలను తీసుకొస్తుంటారు. స్పేస్ ఎక్స్, టెస్లా, స్టార్ లింక్, ఇవన్నీ ఆయన ఆలోచనలే. ఇంకా ఇలాంటి ప్రాజెక్టులకు సంబంధించిన ఆలోచనలు మస్క్ మస్తిష్కంలో మస్త్‌గా ఉన్నాయి. అతని ఆలోచనల్లో ఒకటైన స్టార్ లింక్ ఆగస్టు నుంచి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో అతని ఆవిష్కరణలను చూద్దాం.. 



స్టార్ లింక్ దివాలా తీయకపోతే చాలు.. 
ప్రపంచంలోని ప్రతి గ్రామానికీ ఇంటెర్నెట్ అందించాలనే ఉద్దేశంతో ఎలన్ మస్క్ స్టార్ లింక్ (Star Link) అనే కంపెనీని ప్రారంభించారు. ఇంటర్నెట్‌ను కేబుళ్ల ద్వారా కాకుండా ఉపగ్రహాల (శాటిలైట్ల) ద్వారా అందించాలన్నదే దీని లక్ష్యం. ఇందులో రాకెట్ల ద్వారా భూమికి దాదాపు 550 కి.మీ ఎత్తులో ఉపగ్రహాలను ఉంచుతారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఉపగ్రహం నుంచి సిగ్నల్స్ ఇంటిపై ఉన్న యాంటెన్నాకు చేరతాయి. ఇది డీటీహెచ్ యాంటెన్నాను పోలి ఉంటుంది. యాంటెన్నా నుంచి తీగల ద్వారా రూటర్‌కు సిగ్నల్స్ వస్తాయి. దీని ద్వారా ఇంటర్నెట్ ఉపయోగించుకోవచ్చు. 



స్పేస్‌ ఎక్స్‌ 'స్టార్‌లింక్‌ మిషన్'‌ను 2019 మే 24న ప్రారంభించింది. ఇప్పటివరకు దాదాపు 1500 ఉపగ్రహాలను భూమిపైకి ప్రయోగించింది. స్టార్‌ లింక్‌ సేవలు వచ్చే ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయని మస్క్ ఇటీవల మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్ సదస్సులో ప్రకటించారు. ప్రస్తుతం స్టార్‌ లింక్ సేవలు 12 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇంత పెద్ద ప్రాజెక్టు గురించి ప్రపంచమంతా  ఎదురుచూస్తుంటే మస్క్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టార్ లింక్ ఆర్థికంగా దివాలా తీయకపోవడమే తమ మొదటి లక్ష్యమని అన్నారు. 




కృత్రిమ మేధస్సుతో అద్భుతాలు..
ఈ మధ్య కాలంలో ఓ కోతి దానంతట అదే వీడియో గేమ్ ఆడిన వీడియో మీకు గుర్తుండే ఉంటుంది కదా. ఇది బాగా వైరల్ అయింది. కోతి అలా చేయడానికి కారణం న్యూరాలింక్ (Neura link) చిప్. ఇది కూడా మస్క్ ఆవిష్కరణే. మెదడులో కృత్రిమ మేధస్సుతో కూడిన చిప్ (న్యూరాలింక్) అమర్చడం వల్ల అద్భుతాలు సృష్టించవచ్చని నమ్మిన వ్యక్తి మస్క్. కృత్రిమ మేథతో భవిష్యత్ ఎలా ఉంటుందో అంచనా వేసి 2016లో న్యూరాలింక్ అనే బ్రెయిన్ చిప్ స్టార్టప్ ప్రారంభించారు. దాని అద్భుత ఫలితాలు ఇప్పుడీ కోతి రూపంలో మనకు కనిపిస్తున్నాయి. ఇది విజయవంతం అయితే మనుషుల్లోనూ న్యూరాలింక్ చిప్ ప్రవేశపెడదామనే ఆలోచనలో ఉన్నారు.






ఈ చిప్ పక్షవాతం, అల్జీమర్స్, మెదడుకు సంబంధించిన ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఉపయోగపడుతుందని మస్క్ తెలిపారు. దీనిని మెదడులో అమర్చడం వల్ల పక్షవాతం వచ్చిన వారు నడవగలుగుతారని, స్మార్ట్ ఫోన్ ఉపయోగించగలరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇది పూర్తి స్థాయిలో అమలవ్వడానికి ఇంకొన్ని సంవత్సరాలు పట్టనుందని మస్క్ పేర్కొన్నారు.




సొరంగంలో సవారీ.. 
ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టే రీతిలో మస్క్ సరికొత్త రవాణా వ్యవస్థను ప్రపంచానికి పరిచయం చేశారు. దీని పేరే ‘బోరింగ్‌ టన్నెల్‌’ (Boring Tunnel). మన భాషలో చెప్పాలంటే సొరంగ మార్గంలో సవారీ చేయడం. దీనికి గానూ స్ట్రీట్‌ లెవెల్‌ ప్లాట్‌ఫారమ్స్‌, ఎలక్ట్రిక్‌ స్కేట్స్‌లతో పాటు పట్టాల లాంటివి ఏర్పాటు చేశారు. అలాగే పెద్ద నగరాలలో రోడ్లకు అనుసంధానమై ఉండేలా సొరంగాలను ఏర్పాటు చేశారు. రోడ్డు ఫుట్‌పాత్‌ పక్కన స్ట్రీట్‌ లెవెల్‌ ప్లాట్‌ఫారమ్స్‌ ఏర్పాటు చేయబడి ఉంటాయి. వీటిపై ఎలక్ట్రిక్‌ స్కేట్స్‌ ఉంటాయి. మన కారును తీసుకువెళ్లి ఈ స్కేట్స్‌పై పార్క్ చేసిన వెంటనే అది లోపల సొరంగ మార్గంలోకి తీసుకెళ్తుంది. అక్కడ ఏర్పాటు చేసిన పట్టాల ద్వారా అత్యధిక వేగంతో ప్రయాణించగలం. కారు గమ్యస్థానానికి చేరుకోగానే స్కేట్స్ పట్టాల నుంచి విడిపోయి ఎలివేటర్ సాయంతో పైకి వచ్చి స్ట్రీల్ లెవెల్ మీదకు చేరుకుంటుంది. దీనిని అమెరికాలోని పలు ప్రాంతాల్లో విజయవంతంగా పరీక్షించింది. బోరింగ్ టన్నెల్ (The Boring Company) కంపెనీ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు.


ఒక ట్వీట్‌తో సంపద ఆగమాగం.. 
లగ్జరీ, ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో టెస్లా (Tesla) ఓ సంచలనం అనే చెప్పవచ్చు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా నడిచే కారు టెస్లా ఎస్‌ ప్లెయిడ్‌ (Tesla S Plaid).. 2 సెకన్లలో 96 కి.మీ వేగాన్ని కలిగి ఉంటుంది. లగ్జరీ, పవర్‌ఫుల్‌ ఇంజన్‌ కాంబినేషన్‌లో టెస్లా విడుదల చేసిన ఎస్‌ ప్లెయిడ్‌ కారు అమెరికా మార్కెట్‌లో సంచలనం సృష్టించింది.






బిట్‌కాయిన్లతో టెస్లా కారు కొనవచ్చని మస్క్ ట్వీట్ చేయగానే బిట్ కాయిన్ ధరలు అమాంతం పెరిగాయి. అంతలోనే పర్యావరణ సమస్యలు వస్తున్న కారణంగా బిట్‌కాయిన్లలో లావాదేవీలు చేయబోమని మళ్లీ ట్వీట్ చేయడంతో ధరలు పడిపోయాయి. ఒక్క ట్వీట్‌తో సంపదను ఆగమాగం చేశారనే విమర్శలు కూడా మస్క్‌పై ఉన్నాయి.  
అంగారకుడిపై కాలనీలు..


మరో ఐదేళ్లలో అంగారకుడిపై కాలనీ కట్టిస్తానని, ఒక్కో రాకెట్‌లో వంద మంది మనుషులను పంపిస్తానని మస్క్ 2017లో ఆస్ట్రేలియాలో జరిగిన అంతర్జాతీయ ఖగోళ సమాఖ్యలో వెల్లడించారు. దీని కోసం సొంతంగా రాకెట్లను తయారు చేసేందుకు, అంతరిక్ష పరిశోధనల కోసం మస్క్ 'స్పేస్ ఎక్స్ (Space X)' అనే కంపెనీని కూడా స్థాపించారు. దీని ద్వారా ఇప్పటికే రెండు బృందాలు అంతరిక్ష కక్ష్యలోకి వెళ్లగా తాజాగా మరో బృందం బయలుదేరింది. అంగార‌కుడిపై ఆవాసాల ఏర్పాటే ల‌క్ష్యంగా పలు ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. 
సంచలనాలకు కేరాఫ్..



మస్క్ ఏం చేసినా సంచలనమే. ఇటీవల కాలంలో ఆయన చేసే ట్వీట్ల వల్ల కంపెనీల షేర్లు తారుమారు అయ్యాయి. ఇన్ని విజయాలు సాధిస్తోన్న మస్క్ జీవితంలో ఆటుపోట్లు కూడా ఉన్నాయి. స్పేస్ ఎక్స్ ప్రయోగించిన రాకెట్లు వరుసగా మూడు సార్లు ఫెయిలయ్యాయి. ఇంటి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. తన జీవితంలో 2008 అత్యంత బాధాకరమైన సంవత్సరం అని మస్క్ పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావించారు. ఎలన్ మస్క్ జీవితం, పెళ్లిళ్లు, డేటింగ్, కుమారుడి పేరు (X AE A-XII) అన్నీ మీడియాలో హాట్ టాపిక్స్‌గానే ఉంటాయి. అతని ఆలోచనా తీరు, జీవితంలో ఎదిగిన విధానానికి ఎంతో మంది ఫిదా అయ్యారు. మస్క్ ఇటీవలే 50వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా మస్క్ తల్లి చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంది. తన ప్రయాణంతో ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఈ ఐరన్ మ్యాన్ భవిష్యత్‌లో మరిన్ని వినూత్న ఆవిష్కరణలు చేయాలని ఆశిద్దాం.