తెలంగాణలోని లా కాలేజీల్లో న్యాయ విద్య ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్ సెట్ దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్ సెట్ కోసం ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించకుండా జూలై 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుము రూ.250తో జూలై 15వ తేదీ వరకు, రూ.500తో జూలై 24 వరకు, రూ.1000తో ఆగస్టు 2 వరకు, రూ.2000తో ఆగస్టు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దరఖాస్తుల్లో తప్పులను సరిచేసుకునేందుకు ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు అవకాశం కల్పించనుంది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఆగస్టు 12 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు మరిన్ని వివరాలకు https://lawcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. 


టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్ సెట్ పరీక్షలను ఆగస్టు 23న నిర్వహించనుంది. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమనరీ 'కీ'ని ఆగస్టు 26న విడుదల చేయనుంది. 'కీ' మీద అభ్యంతరాలను ఆగస్టు 27 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనుంది. కాగా, రాష్ట్రంలో మొత్తం 21 లా కాలేజీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం లాసెట్ ద్వారా మూడు, ఐదేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సులు, పీజీఎల్ సెట్ ద్వారా ఎల్ఎల్ఎం కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. 2021 - 2022 విద్యా సంవత్సరానికి సంబంధించిన టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ ఈ ఏడాది మార్చి 24నే విడుదల అయినప్పటికీ, కరోనా కారణంగా దరఖాస్తు గడువును పలుమార్లు పొడిగిస్తూ వచ్చారు. ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతలు ఉస్మానియా యూనివర్సిటీ చూసుకుంటోంది. 
ముఖ్యమైన వివరాలు:
టీఎస్ లాసెట్ (టీఎస్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్) - 2021 (ఎల్‌ఎల్‌బీ - 3/5 ఏళ్లు)
టీఎస్ పీజీఎల్ సెట్ (టీఎస్ పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్) - 2021 (ఎల్ఎల్ఎం - 2 ఏళ్లు) 
అర్హతలు:
ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులకు.. ఇంటర్మీడియట్ 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే 40 శాతం మార్కులు సాధించాలి. 
మూడేళ్ల లా కోర్సులకు.. 45 శాతం మార్కులతో డీగ్రీ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది. ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
వెబ్‌సైట్‌: https://lawcet.tsche.ac.in/
ఫీజు వివరాలు:
టీఎస్ లాసెట్ దరఖాస్తులకు.. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.500, ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. 
టీఎస్ పీజీఎల్ సెట్ దరఖాస్తులకు.. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.800, ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేది: జూలై 5, 2021 (ఆలస్య రుసుము లేకుండా) 
టీఎస్ లాసెట్ - 2021 పరీక్ష తేదీ: ఆగస్టు 23, 2021
టీఎస్ పీజీఎల్ సెట్ - 2021 పరీక్ష తేదీ: ఆగస్టు 23, 2021