బీఈడీ చేయాలనుకునేవారికి శుభవార్త. తెలంగాణలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఎడ్‌సెట్ ) - 2021 నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి 2021 - 22 విద్యా సంవత్సరానికి గానూ టీఎస్ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 19న ప్రారంభం కాగా, కరోనా కారణంగా గడువును పొడిగిస్తూ వస్తోంది. తాజా నోటిఫికేషన్ ప్రకారం ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా జూలై 7 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అపరాధ రుసుము రూ.250తో జూలై 15 వరకు, రూ.500తో జూలై 20 వరకు, రూ.1000తో జూలై 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.450, ఇతరులకు రూ.650గా ఉంది. 
ఆగస్టు 24, 25 తేదీల్లో టీఎస్ ఎడ్‌సెట్ పరీక్షలు నిర్వహించనుంది. పరీక్ష నిర్వహణ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కలిపి మొత్తం 19 పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు టీఎస్ ఎడ్‌సెట్ కన్వీనర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ పరీక్షలను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. దీని ద్వారా రెండేళ్ల కాలవ్యవధి కలిగిన బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎడ్‌సెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. బీఈడీ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో టీచర్‌ ఉద్యోగాలను పొందవచ్చు. 
విద్యార్హతలు: 
ఎడ్‌సెట్ పరీక్ష విషయంలో ఈసారి ప్రభుత్వం పలు మార్పులు చేసింది. బీఏ, బీఎస్సీ, బీకామ్ లాంటి కోర్సులు పూర్తిచేసిన వారితో పాటు ఇతర సబ్జెక్టులతో డిగ్రీ ఉత్తీర్ణులైన వారు కూడా బీఈడీ చేయవచ్చని పేర్కొంది. దీని ప్రకారం బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ హోమ్ సైన్స్, బీసీఏ, బీబీఎం, బీఏ (ఓరియెంటల్ లాంగ్వేజెస్), బీబీఏ లేదా ఏదైనా మాస్టర్స్ డిగ్రీ కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అయిన వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు అయితే 40 శాతం మార్కులతో పాస్ అయితే సరిపోతుంది. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
ముఖ్యమైన వివరాలు:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 


వెబ్‌సైట్‌: https://edcet.tsche.ac.in/
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 19 2021
దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 7, 2021 (ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా)
పరీక్ష సమయం: ఆగస్టు 24న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు.. అదేరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 వరకు.. ఆగస్టు 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. 
పరీక్ష కేంద్రాలు: 
ఆదిలాబాద్, హైదరాబాద్ సౌత్ ఈస్ట్, ఖమ్మం, సిద్దిపేట, పాల్వంచ, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ వెస్ట్, సత్తుపల్లి, నిజామాబాద్, కర్నూలు, హైదరాబాద్ ఈస్ట్, నల్గొండ, కరీంనగర్‌, వరంగల్, విజయవాడ, హైదరాబాద్ నార్త్, కోదాడ, మహబూబ్‌నగర్, నర్సంపేట్ పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయి.