Telangana Gurukulam Admissions: తెలంగాణ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి డిసెంబరు 15న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(TSWREIS) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా బీసీ (MJPTBCWREIS), ఎస్సీ ( TSWREIS), ఎస్టీ (TTWREIS), బీసీ (MJPTBCWREIS) గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశాలు పొందడానికి అర్హులు. ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు గడువు డిసెంబరు 18న ప్రారంభంకాగా.. దరఖాస్తు గడువు జనవరి 6తో ముగియనుంది. అయితే దరఖాస్తు గడువును రెండువారాలపాటు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులు జనవరి 20 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.

ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారకం విద్యార్థులకు ఫిబ్రవరి 11న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంపికచేసిన కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో విద్యార్థులు కనబరిచిన ప్రతిభ, రిజర్వేషన్లకు అనుగుణంగా ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ సొసైటీల కింద మొత్తం 643 గురుకులాల్లో 51,924 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్లకు భారీ పోటీ ఉంటోంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో నాలుగో తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, దీంతోపాటు బోనఫైడ్‌/ స్టడీ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్‌ చేయాలని సూచించారు.

గురుకులాల్లో సీట్ల వివరాలు ఇలా..

సొసైటీ   బాలికల గురకులాలు బాలుర గురుకులాలు సీట్ల సంఖ్య 
ఎస్సీ గురుకులాలు 141  91 18,560
 ఎస్టీ గురుకులాలు 46 36 6,560
బీసీ గురుకులాలు 146 148 23,680
సాధారణ సొసైటీ     20 15 3,124
మొత్తం     353  290  51,924

ప్రవేశ వివరాలు...

* గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు

అర్హత: విద్యార్ధులు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో 2023-24 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుతుండాలి. అయితే జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికైతే మాత్రం సంబంధిత జిల్లాలోని పాఠశాలల్లో తప్పనిసరిగా చదువుతూ ఉండాలి.

వయోపరిమితి: ఓసీ, బీసీ, బీసీ విద్యార్థులు 9 నుంచి 11 సంవత్సరాల మధ్య; ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 సంవత్సరాల మధ్య ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: రూ.100.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా.

ఆదాయ పరిమితి: విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు.

ప్రవేశపరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఓఎంఆర్‌ షీట్‌‌లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. తెలుగు/ ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఇందులో తెలుగు-20 మార్కులు, ఇంగ్లిష్-25 మార్కులు, గణితం-25 మార్కులు, మెంటల్‌ ఎబిలిటీ-10 మార్కులు, పరిసరాల విజ్ఞానం-20 మార్కులు ఉంటాయి. నాలుగో తరగతి స్థాయిలోనే ప్రశ్నలు అడుగుతారు.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.12.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06.01.2024.

➥ ప్రవేశ పరీక్ష తేది: 11.02.2024.

➥ పరీక్ష సమయం: ఉ.11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు.

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...