గులాబ్ తుపాన్ తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. తుపాన్ కారణంగా గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (సెప్టెంబర్ 28), రేపు జరగాల్సిన పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలంగాణలో 28 (నేడు), 29 (రేపు) తేదీల్లో జరగాల్సిన ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వాయిదా పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే వివరాలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. జేన్‌టీయూ పరిధిలో నేడు (సెప్టెంబర్ 28) జరగాల్సిన అన్ని రకాల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. తదుపరి పరీక్షల షెడ్యూళ్లను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.
మహాత్మా గాంధీ వర్సిటీ పరిధిలోనూ..
గులాబ్ తుపాన్ కారణంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో నేడు, రేపు (సెప్టెంబర్ 29) జరగాల్సిన డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎల్లుండి (30వ తేదీ) జరగాల్సిన పరీక్షలు మాత్రం యథాతథంగా జరుగుతాయని తెలిపారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.
Also Read: Cyclone Updates: బలహీనపడ్డ గులాబ్.. తెలంగాణ, ఏపీలో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక్కడ అతిభారీగా..
ఓయూ పరీక్షలు వాయిదా..
తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 28, 29 తేదీల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ ప్రకటన విడుదల చేసింది. మిగతా పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పింది. మరిన్ని వివరాల కోసం వర్సిటీ వెబ్ సైట్ ను సంప్రదించాలని సూచించింది.
టీఎస్ పీఈసెట్ పరీక్ష వాయిదా..
గులాబ్ తుపాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ నెల 30న నిర్వహించాల్సిన టీఎస్ పీఈసెట్ (TSPECET) -2021 ప్రవేశ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు మహాత్మా గాంధీ యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. టీఎస్ పీఈసెట్ పరీక్షను అక్టోబర్ 23వ తేదీన నిర్వహిస్తామని అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఎగ్జామ్ సెంటర్లలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. వర్సిటీ ఇప్పటికే జారీ చేసిన హాల్ టికెట్లతో పరీక్షా కేంద్రానికి హాజరుకావచ్చని సూచించారు.
Also Read: JEE Advanced 2021: జేఈఈ అడ్వాన్స్‌డ్ హాల్ టికెట్లు వచ్చేశాయ్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
నేడు పాఠశాలలు, విద్యా సంస్థలకు సెలవు
గులాబ్ తుఫాన్ కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు నేడు (సెప్టెంబర్ 28) సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కీలక ప్రకటన జారీ చేశారు. అత్యవసర శాఖలైన పోలీసు, రెవెన్యూ, ఫైర్ సర్వీసులు, మున్సిపల్, పంచాయతీ రాజ్, నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖలు మాత్రం విధి నిర్వహణలో ఉండాలని తెలిపారు.
Also Read: Navodaya Admissions: నవోదయలో 9వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి..