AP Sankranthi Holidays: ఏపీలో జనవరి 18తో ముగియాల్సిన సంక్రాంతి పండగ సెలవులను ప్రభుత్వం జనవరి 20 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం జనవరి 17న ఉత్తర్వులు జారీచేసింది. జనవరి 21 ఆదివారంతో కలిపి మొత్తం మూడు రోజులు సెలవులు పొడిగించినట్లయింది. ప్రభుత్వ తాజా ఆదేశాలతో జనవరి 18న తెరచుకోవాల్సిన పాఠశాలలు జనవరి 22న తిరిగి తెరుచుకోనున్నాయి. తల్లిదండ్రుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని సంక్రాంతి సెలవుల్ని పొడిగించినట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. 'ఆడుదాం ఆంధ్రా' కోసం సెలవులు పొడిగించినట్లు తెలుస్తోంది.


ఆడుదాం ఆంధ్రాలో భాగంగా జనవరి 10న ప్రారంభమైన మండల స్థాయి ఆటల పోటీలు జనవరి 20తో ముగియనున్నాయి. క్రికెట్, ఖోఖో, కబడ్డీ వంటి పోటీల్ని చాలా మండలాల్లో ప్రభుత్వ బడులకు అనుబంధంగా ఉన్న క్రీడా మైదానాల్లో, పాఠశాలల ఆవరణల్లో నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జనవరి 19 నుంచి బడులు తెరిస్తే పోటీలతోపాటు తరగతుల నిర్వహణకూ అవరోధమని అధికారులు భావించి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సెలవులు పొడిగింపునకు ప్రభుత్వ మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.  


ఏపీలోని అన్ని స్కూళ్లకు 10 రోజుల పాటు సంక్రాంతి సెలవులను (Sankranti Holidays) ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పాఠశాలలకు మంగళవారం (జనవరి 9) నుంచి సంక్రాంతి సెలవులు అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలో సంక్రాంతి సెలవుల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి జనవరి 16 వరకూ సెలవులుంటాయని ప్రకటించారు.. కానీ ఆ తరువాత మార్పులు చేసిన సర్కార్.. జనవరి 9 నుంచి 18 వరకు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు 10 రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా సెలవులను మరో మూడురోజులు పొడిగించడంతో పాఠశాలలు తిరిగి జనవరి 22న పునఃప్రారంభం కానున్నాయి. ఇక కాలేజీలకు జనవరి 11 నుంచి  జనవరి 17 వరకు సెలవులు ఇచ్చారు.


తెలంగాణలో తెరచుకున్న విద్యాసంస్థలు..
ఏపీలో సంక్రాంతి సెలవులను ప్రభుత్వం పొడిగించగా.. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు జనవరి 18 నుంచి తెరచుకున్నాయి. తెలంగాణలోని స్కూళ్లకు జనవరి 12 నుంచి 17 వరకు సెలవులను ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంటర్ కాలేజీలకు నాలుగురోజులు సెలవులు ఇవ్వగా జనవరి 17న కాలేజీలు ప్రారంభమయ్యాయి. 


ALSO READ:


బీఈడీ కౌన్సెలింగ్‌ నిర్వహణలో జాప్యం, హైకోర్టులో వ్యాజ్యం దాఖలు
బీఈడీ కౌన్సెలింగ్ నిర్వహణలో జాప్యాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) జాతీయ కన్వీనర్ మోర్త రామకృష్ణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్, ఏపీఎడ్ సెట్-2023 కన్వీనర్‌ను (ఆంధ్రా యూనివర్సిటీ) వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. 2023 మార్చిలో నోటిఫికేషన్ జారీచేసి, జూన్‌లో పరీక్ష నిర్వహించి, జులై 14న ఎడ్‌సెట్ ఫలితాలను ప్రకటించారని 10,908 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. ఫలితాలు వెల్లడై ఆరునెలలు పూర్తయినా కౌన్సెలింగ్ నిర్వహించలేదన్నారు. దీంతో విద్యా సంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. కౌన్సెలింగ్ నిర్వహించకపోవడానికి గల కారణాలను సైతం అధికారులు వెల్లడించడం లేదన్నారు. తక్షణం కౌన్సెలింగ్‌ను నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..