KCR Is Walking With Stick: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ (BRS) అధినేత చంద్రశేఖరరావు (KCR) నడక సాధన చేస్తున్నారు. ఫిజయోథెరపీ వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ చేతి కర్ర సాయంతో అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ తన ‘ఎక్స్’ ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. కాలు తొంటి శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్ కొద్ది రోజులు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నందినగర్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకున్నారు. గత నాలుగు రోజుల క్రితం సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలం ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌజ్‌కు వెళ్లి అక్కడ కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తల ఆనందం
చాలా రోజుల వరకు మంచానికే పరిమితమైన కేసీఆర్ చేతి కర్ర సహాయంతో నడుస్తున్న వీడియోను బీఆర్ఎస్ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి. వైద్యులు సలహాలు ఇస్తుండగా కేసీఆర్ నడుస్తున్న వీడియోను ఆయన అభిమానులు తమ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. కేసీఆర్ కోలుకుంటున్నారని, మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేసిఆర్ నడుస్తున్న వీడియోకు ఫైటర్, రెసీలియంట్, స్ట్రాంగ్ కేసీఆర్ అనే ట్యాగ్‌లను జత చేశారు.
డిసెంబర్ 8న శస్త్ర చికిత్స
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు డిసెంబర్ 7వ తేదీ రాత్రి ఆయన ఇంట్లో కాలు జారి కింద పడ్డారు. వెంటనే ఆయన్ను సోమాజిగూడలోని యశోదా హాస్పిటల్‌కు తరలించారు. 8వ తేదీ వైద్యులు ఎడమ తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. సీనియర్ ఆర్ధోపెడిక్ సర్జన్లు, అనెస్థీషియన్లతో కూడిన టీం ఆయనకు విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు. శస్త్రచికిత్స చేసిన తర్వాత ఆయన కోలుకునేందుకు కనీసం ఎనిమిది వారాల సమయం పడుతుందని వెల్లడించారు.
మరుసటి రోజు మరోసారి పరీక్షించి ఫిజియో థెరపీ, పౌష్టికాహారంపై సూచనలు చేశారు. ఆపరేషన్ తరువాత కేసీఆర్ గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స తర్వాత మరుసటి రోజు కేసీఆర్‌ను వైద్యులు తొలిసారి నడిపించారు. వైద్యుల సూచనల మేరకు వాకర్ సాయంతో మెల్లగా అడుగులు వేశారు. శస్త్రచికిత్స తర్వాత కేసీఆర్ ఆరోగ్యం మెరుగుపడిందని, మానసికంగా కూడా కేసీఆర్ దృఢంగా ఉన్నారన్నారు.
మందుల వ్యాపారికి కేసీఆర్ ఫోన్
ఇటీవల కేసీఆర్ తన ఫామ్ హౌస్ పరిసర ప్రాంతానికి చెందిన ఫర్టిలైజర్ వ్యాపారి బాబు రెడ్డికి ఫోన్ చేశారు. తాను కోలుకుంటున్నానని.. పది రోజుల్లో ఫామ్ హౌస్‌కి వస్తానని మాట్లాడారు. ఈ సారి ఫామ్‌హౌస్‌లో బొప్పాయి పంట సాగు చేద్దామని చెప్పారు. అందుకు తగిన ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రస్తుతం ఏఏ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి? నాణ్యమైన విత్తనాల గురించి బాపురెడ్డిని ఆరా తీశారు. కేసీఆర్ ఫోన్ చేయడంతో బాపురెడ్డి ఆనందానికి అవధులు లేవు. కేసీఆర్ కోరినట్టుగానే విత్తనాలు, ఎరువులు సిద్ధం చేస్తానని వివరించారు.