Animal Menstruation: ప్రకృతిలో పునరుత్పత్తి అనేది ఒక నిరంతర ప్రక్రియ. అయితే మనుషుల్లో కనిపించే నెలసరి లేదా రుతుచక్రం(Menstruation) అనేది జంతు ప్రపంచంలో అత్యంత అరుదైన విషయం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 5,502 క్షీరద జాతుల్లో కేవలం రెండు శాతం కంటే తక్కువ జాతుల్లో మాత్రమే ఈ ప్రక్రియ కనిపిస్తుంది. అంటే మిగిలిన 98 శాతం జంతువుల్లో సంతానోత్పత్తి వ్యవస్థ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. స్పైనీ ఎలుకల వంటి జీవుల్లో కూడా నెలసరిని గుర్తించడం వైద్య రంగంలో సరికొత్త చర్చకు దారి తీసింది.
నెలసరి ఎందుకు ఏర్పడుతుంది?
చాలా జంతువుల్లో ఈస్ట్రిస్ సైకిల్ ఉంటుంది. ఇక్కడ గర్భం దాల్చనప్పుడు గర్భాశయం పొరను శరీరం రీఅబ్జార్బ్ చేసుకుంటుంది. కానీ మనుషులు, కొన్ని ప్రత్యేక జంతువుల్లో మాత్రం ఈ పొర బయటకు వచ్చేస్తుంది. దీనికి ప్రధాన కారణం స్పాంటేనియస్ డెసిడ్యువలైజేషన్.
రుతుచక్రం కలిగిన జంతువులలో పిండం గర్భాశయానికి చేరుకోక ముందే తల్లి శరీరం గర్భాసయం పొరను మందంగా రెడీ చేసి పెడుతుంది. ఇది ఒక రకమైన క్వాలిటీ చెక్ లోపభూయిష్టమైన పిండాలను గుర్తించి, అవి గర్భాశయానికి అంటుకోకుండా నిరోధించడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. పిండం సరిగా లేనప్పుడు లేదా గర్భం దాల్చనప్పుడు, ఆ పొర అనవసరమైన రక్తం రూపంలో బయటకు వస్తుంది. దీనినే మనం నెలసరి అంటారు.
నెలసరి ఏ ఏ జాతుల్లో కనిపిస్తుంది?
ప్రకృతిలో నెలసరి అనేది ప్రధానంగా నాలుగు విభిన్న వర్గాల్లో కనిపిస్తుంది. ప్రైమేట్లు, గబ్బిలాలు, ఎలిఫెట్ ష్రూ, స్పైనీ ఎలుకల్లో మాత్రం నెలసరి వస్తుంది. ప్రైమేట్లు అంటే చింపంజీలు, ఇతర కోతి జాతుల్లో మనుషులకు దగ్గరి సంబంధం ఉంటుంది. వీటి రుతు చక్రం సుమారు 35 రోజుల నుంచి 36 రోజులు ఉంటుంది. చింపాజీలలో నెలసరి సమయంలో శారీరక మార్పులు, ముఖ్యంగా జననేంద్రియాలు వద్ద వాపు స్పష్టంగా కనిపిస్తుంది. గొరిల్లాలు మూడు రోజులు, ఒరాంగుటాన్లు ఒకటి నుంచి నాలుగు రోజులు రక్తస్రావం అనుభిస్తాయి.
ఎలుక వంటి జాతుల్లో ఎప్పుడూ ఉండదని భావించిన శాస్త్రవేత్తలకు కైరో స్పైనీ ఎలుక ఆశ్చర్య కలిగించింది. 2016లో జరిగిన పరిశోధనల్లో ఈ ఎలుకలకు 9 రోజుల రుతుచక్రం ఉంటుందని అందులో 3 రోజులు రక్తస్రావం జరుగుతుందని గుర్తించారు. ఎలుకలలో ఇటువంటి ప్రక్రియను గుర్తించడం ఇదే మొదటిసారి. ఎలుకలా కనిపించినా ఏనుగల వర్గానికి చెందిన ఎలిఫెంట్ ష్రూలో కూడా రుతుచక్రం 12 రోజులు ఉంటుంది. వీటిలో సంతానోత్పత్తి సీజన్ ముగిసిన తర్వాత నెలసరి వంటి ప్రక్రియ కనిపిస్తుంది.
గబ్బిలాలలోని కొన్ని జాతుల్లో ముఖ్యంగా ఫుల్వస్ ఫ్రూట్ బ్యాట్లో 33 రోజుల రుతుచక్రం ఉంటుంది. వీటిలో రక్తస్రావం కేవలం ఒక రోజు మాత్రమే జరుగుతుంది. సెబాస్ షార్ట్ టెయిల్డ్ బ్యాట్ వంటి వాటిలో 21 నుంచి 27 రోజుల సైకిల్ ఉంటుంది.
నెలసరికి ఈస్ట్రస్‌కి తేడా ఏంటీ?
చాలా మంది కుక్కలు లేదా పిల్లులకు కూడా నెలసరి వస్తుందని పొరపాటు పడుతుంటారు. కానీ అది నిజం కాదు. కుక్కల్లో కనిపించే రక్తస్రావం ప్రో ఈస్ట్రస్ బ్లీడింగ్. ఇది ఈస్ట్రోజెన్ హార్మోన్ పెరగడం వల్ల రక్తనాళాల నుంచి వచ్చే స్రావం, కానీ గర్భాశయ పొర విచ్చిన్నం కావడం వల్లే వచ్చేది కాదు. ఈస్ట్రస్ సైకిల్‌లో జంతువు కేవలం ఆ హీట్ సమయంలోనే కలయికకు అంగీకరిస్తుంది. గర్భం రాకపోతే పొరను శరీరం తనలోకి తీసుకుంటుంది. కానీ మెన్స్ట్రువల్ సైకిల్‌లో కలయిక ఎప్పుడైనా జరగవచ్చు. గర్భం రాకపోతే పొర రక్తం రూపంలో బయటకు వచ్చేస్తుంది.
