Mallikarjun Kharge Controversy: తమిళనాడు ఎన్నికల ప్రచారం ముగింపు దశలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఆయన చేసిన టెర్రరిస్ట్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన ప్రచార సభలో మల్లిఖార్జున ఖర్గే ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. ఏఐఏడీఎంకే నాయకత్వాన్ని విమర్శించే క్రమంలో ఆయన వివాదాస్పద పదజాలాన్ని ఉపయోగించారు. అన్నాదురై ఫోటో పెట్టుకుని తిరిగే ఏఐఏడీఎంకే నేతలు, మోదీతో ఎలా జతకడతారు? ఆయనొక టెర్రరిస్ట్. ఆయన పార్టీకి సమానత్వం, న్యాయంపై నమ్మకం లేదు. అలాంటి వారితో చేతులు కలపడం అంటే ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమే అని ఖర్గే వ్యాఖ్యానించారు. దేశ ప్రధానిని ఉద్దేశించి ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు ఇలాంటి పదాలు వాడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగాయి. ప్రపంచవ్యాప్తంగా గౌరవించే ప్రధానిని ఉగ్రవాది అనడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఖర్గే తన నిగ్రహాన్ని కోల్పోయి ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అని మండిపడుతున్నారు. ఖర్గే తక్షణమే దేశ ప్రజలకు, ప్రధానికి క్షమాపణ చెప్పాలని, ఎన్నికల కమిషన్ ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
వివాదం ముదరడంతో కాంగ్రెస్ నేతలు ఖర్గే వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఉద్దేశం భౌతికమైన ఉగ్రవాదం గురించి కాదని, విపక్షాలను ఇబ్బంది పెడుతున్న రాజకీయ ఉగ్రవాదం గురించి అని వివరణలు ఇస్తున్నారు. రాజ్యాంగ సంస్థలను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని మోదీ ప్రభుత్వం ఖూనీ చేస్తోందన్న భావనతోనే ఆయన ఆ పదాన్ని వాడారని చెప్తున్నారు.
తమిళనాడులో పోలింగ్‌కు కేవలం ఒక రోజు ముందు ఖర్గే చేసిన ఈ వ్యాఖ్యలు ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ దీనిని ప్రధాన అస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్తుండగా, డీఎంకే కూటమి మాత్రం ఈ వివాదం నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తోంది.
