Chewing Gum Linked to Fertility Issues in Men : ప్రస్తుతం మనం ఉపయోగించే చాలా ప్రొడక్ట్స్‌లో మైక్రోప్లాస్టిక్స్ ఉంటాయి. చాలా ఫుడ్స్‌లో కూడా అవి కలుస్తున్నాయి. తాజాగా చ్యూయింగ్ గమ్ కూడా ఈ జాబితాలో చేరిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిరోజూ చూయింగ్ గమ్ తినడం వల్ల శరీరంలోకి చిన్న ప్లాస్టిక్ కణాలు చేరుతాయని.. అవి మగవారిలో సంతాన సమస్యలను పెంచుతుందనే సందేహాలు పెరుగుతున్నాయి. ఇది ఎంతవరకు నిజమో.. నిపుణులు ఏమంటున్నారో వారు ఇచ్చే సలహాలు ఏంటో చూసేద్దాం.
మైక్రోప్లాస్టిక్స్
మైక్రోప్లాస్టిక్స్ అంటే చాలా చిన్న ప్లాస్టిక్ కణాలు. ఇవి ఆహారం, నీరు, గాలి ద్వారా కూడా మన శరీరంలోకి చేరవచ్చు. అలాగే కొన్ని చూయింగ్ గమ్‌లలో ఉపయోగించే సింథటిక్ పదార్థాల్లో కూడా మైక్రోప్లాస్టిక్స్ ఉండే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.
చూయింగ్ గమ్‌తో ప్రమాదమా?
నిపుణుల అభిప్రాయం ప్రకారం అన్ని చూయింగ్ గమ్‌లు ప్రమాదకరమని చెప్పలేమని అంటున్నారు. కానీ కొన్ని గమ్‌లలో “గమ్ బేస్” అనే పదార్థం సింథటిక్ పాలిమర్స్‌తో తయారవుతుంది. వాటిని ఎక్కువగా నమిలితే.. అది చిన్న కణాలుగా విడిపోయి.. శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంటుందని అంటున్నారు.
మగవారి ఫెర్టిలిటీపై ప్రభావం
యూరోపియన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ రిప్రొడక్షన్ అండ్ ఎంబ్రియాలజీలో 2025లో నివేదించిన అధ్యయనం ప్రకారం.. సంతానోత్పత్తి చికిత్స పొందుతున్న మహిళల నుంచి సేకరించిన నమూనాలలో 69 శాతం, పురుషుల నుంచి సేకరించిన నమూనాలలో 55 శాతం మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నట్లు కనుగొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో 2024లో చేసిన అధ్యయనంలో కూడా మానవ వృషణ కణజాలంలో మైక్రోప్లాస్టిక్‌లను కనుగొన్నారు.
చూయింగ్ మగవారి సంతాన సమస్యలపై ప్రభావం చూపిస్తుందని పూర్తి స్థాయిలో నిర్ధారణ లేదు. కానీ కొన్ని అధ్యయనాల ప్రకారం.. మైక్రోప్లాస్టిక్స్ శరీరంలో చేరితే హార్మోన్‌ల అసమతుల్యతకు కారణమవచ్చు. అలాగే టెస్టోస్టెరోన్ స్థాయిలపై ప్రభావం చూపి.. స్పెర్మ్ క్వాలిటీ తగ్గే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇవి దీర్ఘకాలం కొనసాగితే ఫెర్టిలిటీపై ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిపుణుల సూచనలు
చూయింగ్ గమ్‌ను ఎక్కువగా నమలకుండా పరిమితంగా తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదని చెప్తన్నారు నిపుణులు. అలాగే సహజమైన లేదా ప్లాంట్-బేస్డ్ గమ్‌లు ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్, ప్లాస్టిక్ కంటెంట్ ఉన్న ప్రొడక్ట్స్ తగ్గించాలని.. గ్లాస్ లేదా స్టీల్ కంటైనర్లు ఉపయోగించాలని సూచిస్తున్నారు. అలాగే యాంటీఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ తీసుకుని.. రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలని అంటున్నారు. ఇది పూర్తి ఆరోగ్యంతో పాటు.. హార్మోన్ బ్యాలెన్స్‌కు సహాయపడుతుందని చెప్తున్నారు.
అలాగే సంతానోత్పత్తి కేవలం వయస్సు లేదా ఆహారం మీద మాత్రమే ఆధారపడి ఉండదని.. మన చుట్టూ పరిసరాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చెప్తున్నారు. మీరు భవిష్యత్తులో తల్లిదండ్రులు కావాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ చిన్న అలవాట్లపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. ఎందుకంటే కొన్నిసార్లు మనకు అత్యంత సాధారణంగా అనిపించే విషయాలు దీర్ఘకాలంలో గొప్ప ప్రభావాన్ని చూపుతాయి.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
