జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌ యూజీసీ- నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నెట్‌) డిసెంబర్‌-2022/ జూన్‌-2023 దరఖాస్తు గడువు వారం రోజులు పొడిగించినట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. సీఎస్‌ఐఆర్‌ యూజీసీ-నెట్‌ దరఖాస్తు గడువు ఏప్రిల్ 10తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే వివిధ కార‌ణాల వల్ల చాలా మంది అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించలేకపోయారు. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఏప్రిల్‌ 17 వ‌ర‌కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. 


దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత ఏప్రిల్ 19 నుంచి 25 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించింది. అయితే పరీక్ష తేదీల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని.. ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే జూన్‌ 6, 7, 8 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ స్పష్టం చేసింది.


సైన్స్‌ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్‌ఎఫ్‌తోపాటు లెక్చరర్‌షిప్‌/ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హతల కోసం నిర్వహించే పరీక్ష- సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌. ఈ పరీక్ష ద్వారా జేఆర్‌ఎఫ్‌ అర్హత పొందితే సీఎస్‌ఐఆర్‌ పరిధిలోని రిసెర్చ్‌ సెంటర్లలో, విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. లెక్చరర్‌షిప్‌కు అర్హత పొందితే విశ్వవిద్యాలయాలు లేదా డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఎంపికకావచ్చు.


దరఖాస్తు ఫీజు..
దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు రూ.1100; ఓబీసీ అభ్యర్థులు రూ.550; ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.275 చెల్లించాలి. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.


పరీక్ష విధానం..
➥ మొత్తం 5 సబ్జెక్టులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో కెమికల్ సైన్సెస్, ఎర్త్/ అట్మాస్ఫియరిక్/ ఓషియన్/ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ సబ్జెక్టులు ఉంటాయి.


➥ ప్రతి సబ్జెక్టు నుంచి మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 3 గంటలు. పరీక్షలో సబ్జెక్టుల వారీగా నెగెటివ్ మార్కులు ఉంటాయి.


పరీక్ష పేపర్‌లో మూడు (పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి) విభాగాలుంటాయి.
➥'పార్ట్-ఎ' విభాగంలో జనరల్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలసిస్, అనలిటికల్ & న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిజన్, సిరీస్, ఇతర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.


➥ 'పార్ట్-బి', 'పార్ట్-సి' విభాగాల్లో సంబంధిత సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడుగుతారు.


రాత పరీక్ష ఎప్పుడు..?
జూన్  6, 7 8 తేదీల్లో రాతపరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉ.9.00 గం.- మ.12.00 గం. వరకు మొదటి సెషన్‌లో, మ. 2.00 గం.-సా.5.00 గం. వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 225 నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రధాన నగరాల హైదరాబాద్, గుంటూరులో పరీక్ష నిర్వహణ ఉంటుంది.


తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. 


ఆంధ్రప్రదేశ్‌లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.03.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.04.2023. (17.04.2023 వరకు పొడిగించారు)


➥ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 10.04.2023. 


➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 12.04.2023 to 18.04.2023.


➥ పరీక్ష తేదీలు: 2023, జూన్ 6,7,8 తేదీల్లో.


Online Registration


నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


Also Read:


నీట్ (యూజీ)-2023 దరఖాస్తుకు నేటి నుంచి 13 వరకు అవకాశం, పరీక్ష వివరాలు ఇలా!
దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2023 దరఖాస్తు గడువు ఏప్రిల్ 6తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే అభ్యర్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఎన్టీఏ ఏప్రిల్ 11 నుంచి 13 వరకు మరోసారి దరఖాస్తుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఏప్రిల్ 11న ఉదయం 11.30 గంటల నుంచి ఏప్రిల్ 13న రాత్రి 11.30 వరకు దరఖాస్తు చేసుకోవాలి, అలాగే రాత్రి 11.59 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చని ఎన్టీఏ ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి నీట్ రిజిస్ట్రేషన్ గడువు ఏప్రిల్ 6 తోనే ముగిసింది. అయితే, పలు సమస్యల వల్ల సకాలంలో దరఖాస్తు చేయలేకపోయామని అభ్యర్థులు చేసిన విజ్ఞప్తిని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరిగణనలోకి తీసుకుంది. అటు, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు తమ అప్లికేషన్లలో పొరపాట్లను సవరించుకునేందుకు ఎన్టీఏ తాజాగా కరెక్షన్ విండోను అందుబాటులోకి తీసుకువచ్చింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..