TGSWREIS Gurukula 5th Class Admissions 2025: తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో (TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS,TGREIS) 2025-26 విద్యాసంవత్సరానికిగాను 5వ తరగతి(ఇంగ్లిష్ మీడియం)లో ప్రవేశాలకు గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ వెలువడింది. ప్రవేశాలకు సంబంధించిన పరీక్ష కోసం దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 21న ప్రారంభమైంది. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశాలు పొందడానికి అర్హులు. అర్హులైన విద్యార్థులు ఫిబ్రవరి 1 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. అయితే విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు.
దరఖాస్తు చేసుకున్నవారికి ఫిబ్రవరి 23న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంపికచేసిన కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో విద్యార్థులు కనబరిచిన ప్రతిభ, రిజర్వేషన్లకు అనుగుణంగా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశాలు పొందినవారికి రెగ్యులర్ చదువుతోపాటు ఐఐటీ, ఎన్‌ఐటీ, నీట్, ఎప్‌సెట్ లాంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తారు. విద్యార్థులకు పుస్తకాలు, ఇతర స్టేషనరీ వస్తువులు ఉచితంగా ఇస్తారు. ఉచిత వసతి, ఆరోగ్యకరమైన భోజన సదుపాయాలు ఉంటాయి. వీటితోపాటు స్కూల్ యూనిఫామ్, షూతోపాటు విద్యార్థికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తారు.
విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే హెల్ప్ లైన్ నంబర్: 1800 425 45678, టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్: 040- 23391598, టీజీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్: 9491063511, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్: 040-23328266, టీజీఆర్‌ఈఐఎస్: 040- 24734899 నెంబర్లలో సంప్రదించవచ్చు.
వివరాలు..
* తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు
అర్హత: సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో 2024-25 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదివి ఉండాలి. జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధిత జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి.
వయోపరిమితి: ఓసీ, బీసీ, బీసీ విద్యార్థులు 9 నుంచి 11 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఆదాయ పరిమితి: విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతం రూ.1.50,000; పట్టణ ప్రాంతం రూ.2,00,000 మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.100.
ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
ప్రవేశ పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ పద్ధతిలో ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థులు ఓఎంఆర్ షీట్ విధానంలో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. తెలుగు/ ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో తెలుగు-20 మార్కులు, ఇంగ్లిష్-25 మార్కులు, మ్యాథమెటిక్స్-25 మార్కులు, మెంటల్ ఎబిలిటీ-10 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్-20 మార్కులు ఉంటాయి. 4వ తరగతి స్థాయిలోనే ప్రశ్నలు అడుగుతారు.
పరీక్ష కేంద్రాలు: అన్ని జిల్లాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు...
✪ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 21.12.2024.
✪ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01.02.2025.
✪ ప్రవేశ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 23న.
✪ పరీక్ష సమయం: ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు.
ALSO READ: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!