సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల ఫలితాలు మే 12న వెలువడిన సంగతి తెలిసిందే. అయితే పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు జులైలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. జాతీయ విద్యావిధానం చేసిన సిఫారసుల ఆధారంగా కంపార్ట్‌మెంట్ పరీక్ష అనే పేరును ‘సప్లిమెంటరీ’గా మార్చాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది. బోర్డు పరీక్షల్లో విద్యార్థుల పెర్ఫామెన్స్‌ను మెరుగుపరుచుకొనేందుకు అవకాశం కల్పించింది. 10వ తరగతి విద్యార్థులు తమ మార్కులను మెరుగుపరుచుకొనేందుకు రెండు సబ్జెక్టులను సప్లిమెంటరీ పరీక్షలో భాగంగా రాసుకొనేందుకు వెసులుబాటు కల్పించగా.. 12వ తరగతి విద్యార్థులకు ఒక సబ్జెక్టులో అవకాశం కల్పించింది. సప్లిమెంటరీ కేటగిరీ విద్యార్థులతో పాటు మార్కులను మెరుగుపరుచుకొనేందుకు మళ్లీ కొన్ని సబ్జెక్టులు రాయాలనుకొనేవారికి జులైలో పరీక్ష నిర్వహించనున్నట్టు బోర్డు వెల్లడించింది. ఈ పరీక్షల షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించనున్నట్టు తెలిపారు.
2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షల నిర్వహణ తేదీ ఖరారైంది. 2024 ఫిబ్రవరి 15 నుంచి 10, 12వ తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ పరీక్షల కంట్రోలర్ సన్యం భరద్వాజ్ ప్రకటించారు. ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ముందుగానే పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించాలని విద్యాశాఖ నిర్ణయించిందని తెలిపారు.
మరోవైపు, ఈ ఏడాది నిర్వహించిన సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల ఫలితాలు మే 12న విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాలకు సంబంధించి 3.8లక్షల మంది పదోతరగతి విద్యార్థులు 90 శాతానికి పైగా స్కోరు సాధించగా.. 66 వేల మందికి పైగా 12వ తరగతి విద్యార్థులు 95శాతం పైగా స్కోరు సాధించారని భరద్వాజ్ వెల్లడించారు. విద్యార్థుల మధ్య అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు మెరిట్‌లిస్ట్‌ను ప్రకటించలేదన్నారు. 12వ తరగతి విద్యార్థుల్లో 1,12,838 మంది 90శాతం పైగా స్కోరు సాధించగా.. 22,622మంది విద్యార్థులు 95శాతం పైగా మార్కులు సాధించారన్నారు. అలాగే, పదో తరగతిలో 1,95,799మంది విద్యార్థులు 90శాతం పైగా స్కోరు సాధించగా.. 44,297మంది 95శాతానికి పైగా స్కోరు సాధించినట్టు ఆయన పేర్కొన్నారు.
గతేడాదితో పోలిస్తే తగ్గిన ఉత్తీర్ణత
ఈ ఏడాది సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలను 21,65,805 మంది విద్యార్థులు రాయగా.. 20,16,779 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతా శాతం 93.12గా నమోదైంది. గతేడాది(94.40%)తో పోలిస్తే ఉత్తీర్ణతా శాతం 1.28 తగ్గడం గమనార్హం. అలాగే, 12వ తరగతి పరీక్షలను దేశ వ్యాప్తంగా 16,60,511 మంది విద్యార్థులు రాయగా.. 14,50,174 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది ఉత్తీర్ణతా శాతం 87.33గా నమోదైంది. గతేడాది(92.71%)తో పోలిస్తే 5.38శాతం తగ్గినట్టు అధికారులు వెల్లడించారు.
Also Read:
డిగ్రీ ప్రవేశాలకు 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఆన్‌లైన్ ప్రవేశాలకు 'దోస్త్' నోటిఫికేషన్ వెలువడింది. మాసబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో గురువారం (మే 11) డిగ్రీ దోస్త్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, కళాశాల విద్యాకమిషనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి నాలుగేళ్ల బీఎస్సీ(ఆనర్స్) కోర్సును ప్రవేశ పెడుతున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 16 నుంచి జులై 10 వరకు దోస్త్ ప్రవేశ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం మూడు విడతలుగా ప్రవేశాలను కల్పిస్తారు. ప్రవేశాల ప్రక్రియ పూర్తయిన తర్వాత జులై 17 నుంచి డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి. విద్యార్థులు మొదటి విడతలో రూ.200 చెల్లించాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని, రెండు, మూడో విడుతలో రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
'దోస్త్' పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..