కరోనా మహమ్మారి నేపథ్యంలో 2021 -22 విద్యా సంవత్సరానికి సంబంధించి సీబీఎస్ఈ సరికొత్త విద్యా విధానానికి శ్రీకారం చుట్టింది. కరోనా కారణంగా గతేడాది బోర్డు పరీక్షలు నిర్వహించలేకపోవడంతో భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసేందుకు రెండు దశల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. వచ్చే ఏడాదికి 10, 12 బోర్డు పరీక్షలకు ప్రత్యేక మూల్యాంకన విధానాన్ని అనుసరించనున్నట్లు తెలిపింది. 10, 12వ తరగతుల విద్యార్థులకు బోర్డు పరీక్షలను రెండు దఫాలుగా (టర్మ్‌లుగా) నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దీనికి అనుగుణంగా సిలబస్‌ను క్రమబద్ధీకరిస్తామని వివరించింది. నవంబర్-డిసెంబరులో టర్మ్-1 పరీక్షలను, మార్చి-ఏప్రిల్‌లో టర్మ్-2 పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సీబీఎస్ఈ డైరెక్టర్ (అకడమిక్) జోసెఫ్ ఇమ్మాన్యుయేల్ విడుదల చేశారు. 
పరీక్ష విధానం..
తొలి టర్మ్‌లో బహుళ ఐచ్ఛిక (ఆబ్జెక్టివ్) ప్రశ్నలే ఉంటాయి. ఒక్కో పరీక్ష నిడివి 90 నిమిషాలు ఉంటుంది. రెండో టర్మ్ పరీక్షలను డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించనుంది. దీనికి రెండు గంటల కాలవ్యవధి ఉండనుంది. ఈ విధానంలో వివిధ ఫార్మాట్లలో ప్రశ్నలు ఉండనున్నాయి. ఒకవేళ డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్షలు నిర్వహిచండం సాధ్యం కాకపోతే.. మొదటి టర్మ్ తరహాలోనే పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ భావిస్తోంది. ఈ రెండు పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది మార్కులను కేటాయించనుంది. ఇలా చేయడం వల్ల సిలబస్ భారం ఎక్కువ ఉండదని భావించింది. ఒకవేళ కరోనా తగ్గుముఖం పట్టి పరిస్థితులు చక్కబడితే పూర్తి స్థాయి సిలబస్‌తో మొదటి టర్మ్ పరీక్షలు అక్టోబరు-నవంబరులో, రెండో టర్మ్ ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. 
త్వరలో సిలబస్‌పై స్పష్టత.. 
2021–22 విద్యాసంవత్సరం సిలబస్‌పై సీబీఎస్ఈ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. గత విద్యా సంవత్సరం మాదిరిగా దీనిని క్రమబద్ధీకరించి ఈ నెలలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పాఠశాలలు విద్యా ప్రణాళికలను కొనసాగించేందుకు ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) నుంచి ప్రత్యామ్నాయ అకాడమిక్‌ క్యాలెండర్, ఇన్‌పుట్స్‌ని తీసుకొనే అవకాశాన్ని కూడా కల్పించింది. కాబట్టి త్వరలోనే సిలబస్‌పై స్పష్టత రానుంది. 'మొదటి టర్మ్ సిలబస్ రెండో టర్మ్ సిలబస్ వేర్వేరుగా ఉండనుంది. మొదటి టర్మ్ సిలబస్ రెండో టర్మ్ పరీక్షలో ఉండదు. విద్యార్థులకు ఏ టర్మ్ పరీక్షకు ఉద్దేశించిన సిలబస్ ఆ టర్మ్ లోనే భోధించనున్నారు' అని సీబీఎస్‌ఈ అధికారి ఒకరు వెల్లడించారు. 
పలు పరీక్షల రద్దు చేయడంతో.. 
కరోనా మహమ్మారి నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డు గతేడాది కొన్ని సబ్జెక్టుల పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది బోర్డు పరీక్షలను పూర్తిగా రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇలాంటివి మరోమారు జరగకుండా పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరపాలని భావిస్తోంది. ప్రస్తుత విద్యాసంవత్సరం కోసం సిలబస్‌ను క్రమబద్ధీకరించడంతో పాటు ఇంటర్నల్‌ అసెస్‌మెంట్, ప్రాజెక్ట్‌ వర్క్‌లను మరింత పారదర్శకంగా చేసేందుకు నూతన ప్రణాళికలను అనుసరించనుంది.