CBSE Class 12th Results : సీబీఎస్ఈ 12వ తరగతి టర్మ్‌-1 ఫ‌లితాలు విడుదల అయ్యాయి. నవంబర్‌-డిసెంబర్‌లో జరిగిన టర్మ్‌-1 పరీక్షల్లో విద్యార్థుల మార్కుల జాబితాలను పాఠశాలలకు పంపిస్తుంది సీబీఎస్‌ఈ. ఫలితాల కోసం విద్యార్థులు తమ పాఠశాలలను సంప్రదించవచ్చని పేర్కొంది. గత వారంలో పదో తరగతి టర్మ్‌-1 ఫలితాలను కూడా బోర్డు సంబంధిత పాఠ‌శాల‌ల‌కు ఈ-మెయిల్‌ ద్వారా పంపింది. ఈ ఏడాది పదో తరగతి, 12వ త‌ర‌గ‌తి సిల‌బ‌స్‌ను సీబీఎస్‌ఈ బోర్డు రెండు భాగాలుగా విభ‌జించి టర్మ్‌-1, టర్మ్‌-2గా పరీక్షలు నిర్వహిస్తుంది.  


పాఠశాలలకే ఫలితాలు 


సీబీఎస్ఈ 12వ తరగతి టర్మ్-1 ఫలితాలను బోర్డు శనివారం సాయంత్రం విడుదల చేసింది. 10వ తరగతి ఫలితాల మాదిరిగానే ఈ ఫలితాలు నేరుగా విద్యార్థులకు అందుబాటులో ఉండవు. సీబీఎస్ఈ బోర్డు టర్మ్ -1 థియరీ మార్కులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు పంపిండి. వారు తమ శిక్షా లాగిన్ ఐడీ మార్కులు తెలుసుకోవచ్చు. ఈ మార్కులను ఉపాధ్యాయులు విద్యార్థులతో పంచుకోవడానికి సీబీఎస్ఈ నుంచి ఎటువంటి అభ్యంతరం లేదు. సీబీఎస్ఈ వీటిని అధికారికంగా ఫలితాలు అని పిలవడం లేదు. ఎందుకంటే ఇందులో టర్మ్-1, టర్మ్-2 ప్రాక్టికల్స్, ఇంటర్నల్స్ మొత్తం మార్కులు ఉంటాయి. వీటన్నింటి కలిపి మార్కుల వెయిటేజీని నిర్ణయించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవడానికి ఈ మార్కులు ఉపయోగపడతాయని బోర్డు చెబుతోంది. 12వ తరగతి విద్యార్థుల టెర్మ్ -1 మార్కులను సంబంధిత పాఠశాలలకు పంపింది. విద్యార్థులు వారి సంబంధిత పాఠశాలలను సంప్రదించి మార్కులు తెలుసుకోవచ్చని సీబీఎస్ఈ సీనియర్ అధికారి తెలిపారు. 


విద్యార్థులు ఫలితాలు ఇలా తెలుసుకోవచ్చు


సీబీఈఎస్ 12వ తరగతి టర్మ్ 1 పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ పాఠశాలల నుంచి స్కోర్‌లను పొందవచ్చు. సీబీఎస్ఈ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో స్కోర్‌లను ఆన్‌లైన్‌లో విడుదల చేయలేదు. పలు పాఠశాలలకు తమ లాగిన్ ఐడీలలో ఫలితాలు చూపించడంలేదు. గతంలో విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో కూడా ఇదే విధమైన ఆలస్యం జరిగింది. అయితే తెల్లవారుజామున ప్రతి పాఠశాలకు ఫలితాలు రావడంతో సర్వర్ సమస్యగా తేల్చారు. ఈ విద్యా సంవత్సరానికి బోర్డు పరీక్షలను రెండు పర్యాయాలు నిర్వహిస్తామని సీబీఎస్‌ఈ ప్రకటించింది. గత ఏడాది నవంబర్ 30 నుంచి డిసెంబర్ 11 మధ్య టర్మ్-1 పరీక్షలు జరిగాయి. మార్చి 12న సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి టర్మ్-II బోర్డ్ ఎగ్జామినేషన్ తేదీలను విడుదల చేసింది. 10, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి ప్రారంభమవుతాయి. సీబీఎస్ఈ నోటిఫికేషన్ ప్రకారం ఒకే షిఫ్ట్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 10.30 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి.