BJP Rayalaseema Ranabheri : కడపలో బీజేపీ రాయలసీమ రణభేరీ సభ నిర్వహించింది. ఈ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)తో పాటు బీజేపీ ముఖ్యనేతల పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు(Somu Veerraju) మాట్లాడుతూ రాయలసీమ రణ భేరి సాక్షిగా పెండింగ్ ప్రాజెక్టుల సాధనే బీజేపీ లక్ష్యమని తెలిపారు. రాయలసీమకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందన్నారు. రాయలసీమలో అనేక వనరులు ఉన్నాయన్నారు. సోమశిల ప్రాజెక్టు కోసం బద్వేలు ప్రజలు పోరాడుతున్నారని గుర్తుచేశారు. పోలవరం(Polavaram) ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేస్తుందన్నారు. యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నారు. ఈ సభలో వైసీపీ ప్రభుత్వంపై సోము వీర్రాజు ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వం(Ysrcp Govt) కక్షపూరిత పరిపాలన చేస్తుందని ఆరోపించారు. పులివెందులలో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తే ఆమె భూములు కబ్జా చేశారన్నారు. జగన్ వ్యక్తిగత కక్షలు మానుకోవాలని బీజేపీ హితవు పలికింది. ఇసుక, మట్టి అమ్ముకునే దొంగలకు బీజేపీ కార్యకర్తలు భయపడరన్నారు. చైనా, పాకిస్థాన్ లాంటి వారికే బీజేపీ భయపడలేదన్నారు.
ఒక వర్గం వారికే అధిక సీట్లు
రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి మాట్లాడుతూ... విభజన తర్వాత రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు అయ్యారని అయినా అభివృద్ధి జరగలేదన్నారు. సమర్థత ఉన్న నాయకులను వచ్చే ఎన్నికల్లో గెలిపించుకోవాలని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదని ఆరోపించారు. అధికారానికి బలహీన వర్గాలు దూరంగా ఉంటున్నాయన్నారు. బడుగు బలిహీన వర్గాల ప్రజలకు రాజకీయ ప్రాముఖ్యత కలిగించిన వ్యక్తి దివంగత ఎన్టీఆర్ అని, ఒక్క సామాజిక వర్గానికే ఇప్పటి ప్రభుత్వం సీట్లు కేటాయిస్తుందని ఆరోపించారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని విమర్శించారు. జగన్ అరాచక, దుర్మార్గపు పాలన చేస్తున్నారని సుజనా చౌదరి ఆరోపించారు.
వైసీపీని తరిమికొట్టండి
కొన్ని దశాబ్దాలుగా రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు అలానే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా ఏపీ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టడంలేదు. రాయలసీమ అభివృద్ధి కావాలంటే డబల్ ఇంజన్ ప్రభుత్వం బీజేపీ రావాలి. అవినీతి రహిత పాలన కావాలంటే ఏపీలో బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం రావాలి. రాయలసీమ రతనాల సీమ కావాలంటే వైసీపీని రానున్న ఎన్నికల్లో తరిమి కొట్టాలి. " బీజేపీ జాతీయ కార్యదర్శి కన్నా లక్ష్మీనారాయణ
వివేకా హత్యపై ఘాటు వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్ చెప్పినట్టు ప్రతిపక్షాలు ఏకమై జగన్ ను గద్దె దించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. సొంత చిన్నాన్నను కుటుంబ సభ్యులే దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. వివేకా హత్యను తన పైకి నెట్టాలని చూశారని ఆరోపించారు. వైఎస్సార్ స్టీల్ ఫ్యాక్టరీకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారని, ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదని ఆరోపించారు. హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా రాజధాని విషయంలో మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్తున్నారని విమర్శించారు. ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు కలిసి మాజీ మంత్రి వివేకాను దారుణంగా హత్య చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.