సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఆగస్టు 1న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. సీబీఎస్‌ఈ 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ రూల్ నెంబరు, స్కూల్ నెంబరు, అడ్మిట్ కార్డు ఐడీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా జులై 17న 12వ తరగతి పరీక్షలు, జులై 17 నుంచి 22 వరకు పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా 12వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసిన అధికారులు త్వరలోనే 10వ తరగతి ఫలితాలను కూడా ప్రకటించనున్నారు. మొత్తం 1,20,742 మంది విద్యార్థులు 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కాగా.. 60,419 మంది విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు హాజరయ్యారు.
ALSO READ:
ఇంటర్ ప్రవేశాల గడువు మరోసారి పొడిగింపు, ఎప్పటివరకంటే?
తెలంగాణలో జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశ గడువును ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. వాస్తవానికి ఆగస్టు 5తో దరఖాస్తు గడువు ముగియాల్సి ఉండగా.. ఆగస్టు 16 వరకు ప్రవేశాలు పొందవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ జులై 31న ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ప్రైవేటు కళాశాలల్లో చేరేవారు ఆలస్య రుసుం కింద రూ.500 చెల్లించాలని, ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల కళాశాలల్లో చేరేవారు మాత్రం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు ప్రవేశాలు పొందని వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా 3,339 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉండగా.. వీటిల్లో ఇప్పటి వరకు 3,27,202 మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్‌లో అడ్మిషన్ తీసుకున్నారు. గతేడాది కాలేజీల సంఖ్య 3,107 మాత్రమేకాగా.. 4,98,699 మంది విద్యార్థులు చేరారు. దీనిని బట్టి దాదాపు 1.7 లక్షల మంది విద్యార్థులు ఇంకా చేరాల్సి ఉందని తెలుస్తోంది. వారంరోజుల క్రితం వరకూ ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థుల అడ్మిషన్లు జరుగుతున్నా, ప్రవేశాలను బోర్డుకు చూపించలేదు. విద్యార్థుల ప్రవేశాలు ఒకచోట, వారు చదివేది మరోచోట ఉండేలా కాలేజీలు చేస్తున్న మాయాజాలంపై ఇంటర్ బోర్డు ఉక్కుపాదం మోపడమే ఈ ఆలస్యానికి కారణమని తెలుస్తోంది.
అడ్మిషన్లు ముగిసే నాటికి ప్రవేశాలు చూపించని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ హెచ్చరించారు. దీంతో గత వారం లక్ష వరకూ ఉన్న అడ్మిషన్ల సంఖ్య ప్రస్తుతం 2 లక్షలు దాటింది. టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు వెలువడిన తర్వాత ప్రభుత్వ కాలేజీల్లోనూ ప్రవేశాలు కొంత పెరిగాయి.
అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును పొడిగించారు. ఆగస్టు 16 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. దరఖాస్తు గడువు జులై 31తో ముగియాల్సి ఉన్నప్పటికీ.. అభ్యర్థుల అభ్యర్థన మేరకు ప్రవేశ దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. అభ్యర్థులు ఆగస్టు 16 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..