సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. సీబీఎస్ఈ బోర్డు తన అధికారిక వైబ్ సైట్ ద్వారా ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 99.37 శాతం (12,96,318 మంది) ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డు వెల్లడించింది. గతేడాది 88.78 శాతంగా ఉన్న ఉత్తీర్ణతా శాతం.. ఈసారి పెరిగింది.
ఫలితాల్లో బాలికలే ముందంజలో నిలిచారు. బాలుర కంటే 0.54 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణతా శాతం 99.13గా ఉండగా.. బాలికలది 99.67 శాతంగా నమోదైంది. ఢిల్లీలో అత్యధికంగా 99.37 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కేంద్రీయ విద్యాలయాలు (కేవీ), సీటీఎస్ఏ పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి.
ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లలో (cbseresults.nic.in, cbse.gov.in) చెక్ చేసుకోవచ్చు. దీంతో పాటు డిజిలాకర్ (DigiLocker) యాప్, ఉమాంగ్ (UMANG) యాప్, digilocker.gov.inలలో కూడా ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలను చెక్ చేసుకునేందుకు విద్యార్థులు వారి రోల్ నంబర్, ఇతర క్రెడెన్షియల్స్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
గతంలో ఉన్న షెడ్యూల్ ప్రకారం సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు మే నెలలో జరగాల్సి ఉంది. కరోనా తీవ్రత పెరుగుతోన్న నేపథ్యంలో బోర్డు పరీక్షలను రద్దు చేసింది.
ఫలితాలు చూసుకోండిలా..
- cbse.gov.in వెబ్ సైట్‌ను ఓపెన్ చేయాలి.
- అక్కడ రిజల్ట్స్ సెక్షన్‌ను ఎంచుకోవాలి.
- హోం పేజీలో సీబీఎస్ఈ 12 ఫలితాలు 2021 అని ఉన్న ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. దీంతో మరో పేజ్ ఓపెన్ అవుతుంది.
- ఇక్కడ విద్యార్థులు తమ రోల్ నంబర్, ఇతర క్రెడెన్షియల్స్ వివరాలు ఎంటర్ చేయడంతో ఫలితాలు కనిపిస్తాయి.
- రిజల్ట్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
మార్కుల కేటాయింపు ఇలా..
ఫలితాల వెల్లడికి ప్రత్యామ్నాయ విధానాలను ఎంచుకుంది. 30:30:40 ఫార్ములాను అనుసరించి మార్కులను కేటాయించింది. ఈ ఫార్ములా ప్రకారం.. పది, 11వ తరగతి, 12వ తరగతి ప్రీ బోర్డు పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా 12వ తరగతి ఫైనల్ మార్కులను కేటాయించనుంది. టెన్త్ మార్కుల నుంచి 30 శాతం వెయిటేజీ, 11వ తరగతి మార్కుల నుంచి 30 శాతం వెయిటేజీతో పాటు 12వ తరగతి ప్రీ బోర్డు పరీక్షలకు 40 శాతం వెయిటేజీ ఇవ్వనుంది.
క్వాలిఫయింగ్ మార్కులు సాధించని విద్యార్థులను కంపార్ట్మెంట్ కేటగిరీలో ఉంచుతారు. ఫలితాలపై ఎవరైనా విద్యార్థులు సంతృప్తి చెందకపోతే వారికి పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తామని బోర్డు ప్రకటించింది.