సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ తరగతి ఫలితాల విడుదలపై క్లారిటీ వచ్చింది. 10వ తరగతి ఫలితాలను వచ్చే వారం విడుదల చేయనున్నట్లు బోర్డు కంట్రోలర్ శ్యామ్ భరద్వాజ్ వెల్లడించారు. అయితే ఏ తేదీన ఫలితాలను విడుదల చేస్తారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రమవుతోన్న నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డు 10వ తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. 10వ తరగతి ఫలితాలను సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ cbseresults.nic.in, cbse.gov.in ద్వారా వెల్లడించనుంది. ఫలితాలను చెక్ చేసుకునేందుకు విద్యార్థులు వారి రోల్ నంబర్, ఇతర క్రెడెన్షియల్స్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
విడదలైన 12వ తరగతి ఫలితాలు..
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. సీబీఎస్ఈ బోర్డు తన అధికారిక వైబ్ సైట్ ద్వారా ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 99.37 శాతం (12,96,318 మంది) ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డు వెల్లడించింది. గతేడాది 88.78 శాతంగా ఉన్న ఉత్తీర్ణతా శాతం.. ఈసారి పెరిగింది.
ఫలితాల్లో బాలికలే ముందంజలో నిలిచారు. బాలుర కంటే 0.54 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణతా శాతం 99.13గా ఉండగా.. బాలికలది 99.67 శాతంగా నమోదైంది. ఢిల్లీలో అత్యధికంగా 99.37 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కేంద్రీయ విద్యాలయాలు (కేవీ), సీటీఎస్ఏ పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి.
మరింత చదవండి: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల..