తెలంగాణలో జేఈఈ మెయిన్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పెద్ద షాకిచ్చింది. రాష్ట్రంలో నాలుగు పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. జేఈఈ పరీక్షలు నిర్వహించే పట్టణాల జాబితా నుంచి రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, గద్వాల, మంచిర్యాల, వికారాబాద్‌ కేంద్రాలను తొలగించింది. గతేడాది రాష్ట్రంలో 21 పట్టణాల్లో జేఈఈ మెయిన్‌ పరీక్షలు నిర్వహించగా, ఈ ఏడాది 17 పట్టణాలకే పరిమితం చేసింది. ఆదిలాబాద్‌ నుంచి పరీక్ష రాసే వారు ఇకనుంచి నిజామాబాద్‌ లేదా హైదరాబాద్‌లో, వికారాబాద్‌ అభ్యర్థులు హైదరాబాద్‌ లేదా సంగారెడ్డిలో, గద్వాల అభ్యర్థులు 95 కిలోమీటర్లు ప్రయాణించి మహబూబ్‌నగర్‌లో పరీక్షలు రాయాల్సిన పరిస్థితిని ఎన్టీఏ తీసుకురావడంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


గతేడాది జేఈఈ మెయిన్‌ పరీక్షల పట్టణాలు: ఆదిలాబాద్‌, గద్వాల, హయత్‌నగర్‌, హైదరాబాద్‌/సికింద్రాబాద్‌, జగిత్యాల, జనగాం, కరీంనగర్‌, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, మెదక్‌, మేడ్చల్‌, నల్లగొండ, నిజామాబాద్‌, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్‌, వరంగల్‌.


ఈ ఏడాది పరీక్షలు నిర్వహించే పట్టణాలు: హయత్‌నగర్‌, హైదరాబాద్‌/సికింద్రాబాద్‌, జగిత్యాల, జనగాం, కరీంనగర్‌, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌, మేడ్చల్‌, నల్లగొండ, నిజామాబాద్‌, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌.


జేఈఈ మెయిన్ షెడ్యూలు ఇలా..
జేఈఈ మెయిన్ పరీక్షలను రెండు విడతల్లో ఎన్‌టీఏ నిర్వహించనుంది. తొలి విడత పరీక్షలను జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో నిర్వహించనున్నారు. రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. జనవరి 12 వరకు తొలి విడత జేఈఈ మెయిన్ దరఖాస్తుల స్వీకరించనున్నారు. 

జేఈఈ మెయిన్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఎన్‌ఐటీలు, ఐఐటీలు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో యూజీ కోర్సు్లో (బీఈ/బీటెక్) ప్రవేశాల కోసం పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌‌డ్ కోసం కూడా దీన్నే అర్హత పరీక్షగా పరిగణిస్తారు. ఇక బీఆర్క్, బీప్లానింగ్ కోర్సు్ల్లో ప్రవేశాల కోసం పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్-2023 పరీక్షను మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళం, కన్నడ, మరాఠి, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ, పంజాబీ భాషల్లో పరీక్ష ఉంటుంది.

బీఈ, బీటెక్‌, బీఆర్క్‌, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్‌ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. వీరిలో మంచి స్కోర్‌ సాధించిన 2.5 లక్షల మంది విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు.


Also Read:


తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!
హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022-23 విద్యాసంవత్సరానికి దూరవిద్య కేంద్రం (CDE) ద్వారా నిర్వహించే కోర్సుల్లో ప్రవేశాలకు డిసెంబరు 27న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రవేశాలు కోరువారు డిసెంబరు 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. రూ.200 ఆలస్య రుసుముతో మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ప్రవేశం పొందిన విద్యార్థులకు మే లేదా జూన్ నెలలో SMS లేదా వాట్సాప్ ద్వారా తరగతులకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమ ఫొటో, ఒరిజినల్ సర్టిఫికేట్ల స్కానింగ్ కాపీలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
కోర్సుల వివరాలు, దరఖాస్తు విధానం కోసం క్లిక్ చేయండి.. 


కేయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల రివైజ్డ్ షెడ్యూలు విడుదల, ఎగ్జామ్స్ ఎప్పుడంటే?
కాకతీయ విశ్వవిద్యాలయం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో డిసెంబరు 28 నుంచి ప్రారంభం కావాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. పరీక్షల రీషెడ్డ్యూల్‌ను డిసెంబరు 27న వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డా.పి.మల్లారెడ్డి, అదనపు అధికారులు డా.జె.మధుకర్, డా.ఎ.నరేందర్ విడుదల చేశారు. దీనిప్రకారం జనవరి 4 నుంచి ఐదో సెమిస్టర్, 5 నుంచి మూడో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇక డిగ్రీ ఒకేషనల్ మూడో సెమిస్టర్ పరీక్షలు జనవరి 10 నుంచి, ఐదో సెమిస్టర్ పరీక్షలు జనవరి 6 నుంచి ప్రారంభంకానున్నాయి.
పరీక్షల కొత్త షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..