RGUKT Basar Admission Notification: తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(బాసర ట్రిపుల్ ఐటీ)లో ఆరేళ్ల బీటెక్‌ కోర్సులో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ వి.వెంకటరమణ మే 27న ప్రవేశ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది దరఖాస్తు విధానాన్ని SSC బోర్డు సర్వర్‌తో అనుసంధానించినట్లు తెలిపారు. దీంతో విద్యార్థి హాల్‌టికెట్‌ నెంబర్‌, పేరు వంటి వివరాలు నమోదుచేయగానే ఆటోమెటిక్‌గా వివరాలు ప్రత్యక్షమవుతాయన్నారు.


విద్యార్థులకు ఇంటర్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా బీటెక్‌లో వివిధ బ్రాంచీల్లోని సీట్లను భర్తీ చేయనున్నట్లు వెంకటరమణ తెలిపారు. తొలి ఏడాదికి ఫీజు రూ.37 వేలు ఉండగా..రీయింబర్స్‌మెంట్ అర్హత ఉన్న వారు ఆ రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. దానికితోడు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1000, కాషన్ డిపాజిట్ రూ.2 వేలు, ఆరోగ్య బీమా కింద రూ.700... మొత్తం రూ.3,700 అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రవేశాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ లేదా 7416305245, 7416058245, 7416929245 హెల్ప్‌లైన్‌ నెంబర్ల ద్వారా సంప్రదించవచ్చని వీసీ సూచించారు. 


జూన్ 1 నుంచి దరఖాస్తులు..
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్‌ 1 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. జూన్‌ 22న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే స్పెషల్‌ కేటగిరీ కింద పీహెచ్‌, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ తదితర విద్యార్థులు జూన్‌ 29 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను జులై 3న ప్రకటించనున్నారు. విద్యార్థులకు జులై 8 నుంచి 10 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఓసీ, ఓబీసీ విద్యార్థులకు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.450 చెల్లించాలి.  


వివరాలు..


బాసర ట్రిపుల్‌ ఐటీ 2024-25 ప్రవేశాలు


సీట్ల సంఖ్య.. 
మొత్తం 1650 ఇంటిగ్రెటెడ్‌ బీటెక్‌(ఇంటర్‌+బీటెక్‌) సీట్లు భర్తీ కానున్నాయి. యూనివర్శిటీలో 1500 సీట్లు ఉండగా.. 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద, మరో 150 అదనంగా భర్తీ చేస్తారు. మొత్తం సీట్లలో 85 శాతం రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లకు రాష్ట్రంతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడతారు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు 5 శాతం సీట్లు సూపర్ న్యూమరీ కింద కేటాయిస్తారు. 


అర్హతలు..
మొదటి ప్రయత్నంలోనే పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థుల వయసు 01.06.2024 నాటికి 18 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 21 సంవత్సరాల వరకు మినహాయింపు ఉంది. 


ఎంపిక విధానం..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారి పదో తరగతి గ్రేడ్‌కు 0.40 స్కోర్‌ కలుపుతారు. ఒకవేళ ఇద్దరు విద్యార్థుల స్కోర్‌ సమానంగా ఉంటే.. ఏడు కొలమానాలను పరిగణనలోకి తీసుకుంటారు. మొదట గణితంలో, తర్వాత సైన్స్, ఆంగ్లం, సాంఘికశాస్త్రం, ప్రథమ భాషలో గ్రేడ్‌ను పరిశీలించి సీట్లు ఇస్తారు. అవీ సమానంగా ఉంటే పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ వయసు ఉన్న వారికి సీటు కేటాయిస్తారు. అది కూడా సమానంగా ఉంటే హాల్‌టికెట్‌ ర్యాండమ్‌ నంబరు విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.


ప్రవేశాల షెడ్యూలు ఇలా..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.06.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 22.06.2024.


➥ స్పెషల్ కేటగిరీ విద్యార్థుల దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 29.06.2024.


➥ సీట్ల కేటాయింపు (స్పెషల్ కేటగిరీ మినహాయించి): 03.06.2024.


➥ సర్టిఫికేట్ వెరిఫికేషన్: 08.06.2024 నుంచి 10.06.2024 వరకు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..