తెలంగాణలో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు చదువుతోపాటే ఉద్యోగ, ఉపాధి నైపుణ్యాలు కల్పించే దిశగా విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు 'సెక్టార్‌ స్కిల్స్‌' కోర్సుల్లో శిక్షణకు నడుం బిగించింది. కళాశాల విద్యార్థులు మూడు రోజులు తరగతుల్లో.. మరో మూడు రోజులు పరిశ్రమల్లో పనిచేసే విధంగా 'అప్రెంటిస్‌షిప్‌ ఎంబెడెడ్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ (ఏఈడీపీ)' కోర్సులను ప్రవేశపెట్టింది. దీంతో చదువుతోపాటు ఉపాధిశిక్షన పొందుతూ.. నెలకు రూ.6 వేల వరకు స్టైపెండ్‌ పొందే అవకాశం లభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి విద్యాశాఖ ప్రారంభించింది. 


తెలుగు విశ్వవిద్యాలయంలో అక్టోబరు 4న జరిగిన కార్యక్రమంలో.. 17 డిగ్రీ కళాశాలల్లో బీబీఏ రిటైల్‌ ఆపరేషన్స్‌ కోర్సు ప్రథమ సంవత్సరంలో చేరిన 661 మంది విద్యార్థులకు ఆయా పరిశ్రమలు, స్టోర్లలో పనిచేసేందుకు అప్రెంటిస్‌షిప్‌ ఉత్తర్వులను విద్యాశాఖ అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా తొలి ఏడాది రెండు సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలను విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య లింబాద్రి, కేంద్ర విద్యాశాఖ మాజీ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు ఆవిష్కరించారు. వాటిని విద్యార్థులకు ఉచితంగా అందజేయనున్నారు. ప్రముఖ ఐటీ కంపెనీ డెలాయిట్‌లో ఉద్యోగాలు పొందిన బేగంపేట మహిళా కళాశాల విద్యార్థినులకు ఆఫర్‌ లెటర్లు కూడా అందజేశారు.


ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ.. బీబీఏ రిటైల్‌ ఆపరేషన్స్‌ కోర్సు ప్రవేశపెట్టాలని నిర్ణయించిన మూడు రోజుల్లోనే 'దోస్త్‌'లో చేర్చామని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో తొమ్మిది రకాల నైపుణ్య కోర్సులు ప్రవేశపెట్టినట్లు ఆమె తెలిపారు. ఉన్నత విద్యామండలి, రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలోని సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ స్కీమ్స్‌ అండ్‌ పాలసీస్‌ (క్రిప్స్‌), రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ స్కిల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ జేమ్స్‌ రాఫెల్‌, కళాశాల విద్యాశాఖ అధికారుల సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. 


ఇక ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి మాట్లాడుతూ.. ఉద్యోగం, ఉపాధి లభించే కోర్సులను ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్‌ తరచూ సూచిస్తుంటారని, ఈ కోర్సుల ద్వారా అది కొంతవరకు నెరవేరిందన్నారు.


కేంద్ర విద్యాశాఖ మాజీ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. విద్యాసంస్థలు, పరిశ్రమలను ఒక తాటిపైకి తెచ్చే సెక్టార్‌ స్కిల్స్‌ కోర్సులకు సంబంధించి విద్యాశాఖకు తమ వంతు సహకరించామన్నారు. 


ALSO READ:


బీసీ, ఈబీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్, దేశంలో ఎక్కడ చదివినా బోధన ఫీజులు
తెలంగాణ ప్రభుత్వం బీసీ, ఈబీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. బీసీ విద్యార్థుల ‘స్వదేశీ విద్యానిధి’ పథకాన్ని 2023-24 విద్యాసంవత్సరం నుంచే అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలోని 200 అత్యుత్తమ, ప్రఖ్యాత జాతీయస్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన రాష్ట్రానికి చెందిన బీసీ, ఈబీసీ విద్యార్థులకు బోధన ఫీజులు చెల్లించనున్నారు. విద్యార్థులకు ఏటా రూ.2 లక్షలు లేదా కోర్సు ఫీజు ఈరెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అక్టోబరు 4న అధికారిక ఉత్తర్వులు జారీచేశారు. ప్రవేశం పొందితే బోధన ఫీజులు మంజూరు చేయాలని బీసీ సంక్షేమశాఖ కమిషనర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు మరోసారి పొడిగించారు. అక్టోబరు 4తో గడువు ముగియగా.. ప్రవేశాలు పొందేందుకు అక్టోబరు 20 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థులు అక్టోబరు 20 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. 
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...