ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హస్తినకు వెళ్లనున్నారు. సీఎం జగన్ మూడు రోజులు పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర మంత్రులతో జగన్ సమావేశం కానున్నారు. రాత్రికి 1 జన్‌పథ్‌ నివాసంలో బస చేయనున్నారు. 6న ఉదయం 9.45 గంటలకు 1 జన్‌పథ్‌ నివాసం నుంచి విజ్ఞాన్‌ భవన్‌కు చేరుకుని వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొంటారు.


ఏపీలో ముందస్తు ఎన్నికలపై కొంత కాలంగా చర్చజరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఈ నెలలోనే రానుండటంతో జగన్ ఢిల్లీ పర్యటనపై ఆసక్తిరేపుతోంది.  ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగాలంటే ముందు అసెంబ్లీని రద్దు చేయాలి. నోటిఫై చేయాలి. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈసీ స్వయంగా పర్యటించి సంతృప్తి చెందాలి. ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తారు. ఇప్పటికిపుడు అసెంబ్లీ రద్దు చేస్తే, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం అనేది సాధ్యం కాదని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఏపీలో ఎన్నికల 2024 ఏప్రిల్ నెలలో జరగనున్నాయి.                 


 టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. టీడీపీకి ప్రజల్లో సానుభూతికి పెరుగుతోంది. 25 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి జైలులోనే ఉన్నారు. ఇలాంటి సమయంలో జగన్ ఢిల్లీకి వెళ్లి మోడీ, అమిత్ షాలతో భేటీ అవుతుండటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.  చంద్రబాబు అరెస్టు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. చంద్రబాబు అరెస్టుకు దారి తీసిన పరిణామాలు, శాంతిభద్రతల పరిస్థితుల గురించి ప్రధాని మోడీకి సీఎం జగన్ నివేదిక ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 


ఏపీ ప్రభుత్వాన్ని నిధుల కొరత వేధిస్తోంది. అప్పుల కోసం ప్రతీ వారం ఆర్బీఐ వద్ద బాండ్లు వేలం వేస్తోంది. కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున బిల్లులు చెల్లించాల్సి ఉంది. వచ్చే జనవరిలోపు రూ. పదిహేను వేల  కోట్లు బిల్లులు చెల్లింపులు చేయాల్సి ఉందని భావిస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాష్ట్ర విభజన హామీలపై ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులను కలవనున్నారు జగన్