AP 10th Class Supplementary Exams | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ (AP SSC Advanced Supplementary) పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షలు మే 25వ తేదీ నుండి ప్రారంభమై జూన్ 4వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను పాఠశాలల అధికారిక లాగిన్లలో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డాక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి ప్రకటనలో వెల్లడించారు.
విద్యార్థులు తమ హాల్‌టికెట్లను సులభంగా పొందేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 'మనమిత్ర' వాట్సప్ నంబర్ 95523 00009 ద్వారా విద్యార్థులు నేరుగా తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దీనితో పాటు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారిక వెబ్‌సైట్‌లోనూ వీటిని అందుబాటులో ఉంచనున్నారు. విద్యార్థులు తమ ఎస్ఎస్సీ మార్చి 2026 నాటి పాత రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి హాల్‌టికెట్లను సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Also Read: టెన్త్ తరవాత ఈ కోర్స్ చేస్తే, విదేశాల్లో కొలువు సంపాదించొచ్చు
ఏపీ పదో తరగతి ఫలితాల్లో 85. 25 శాతం ఉత్తీర్ణత
ఆంధ్రప్రదేశ్‌లో విడుదలైన పదోతరగతి ఫలితాల్లో ఈ ఏడాది మొత్తం 85.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది ఉత్తీర్ణత 81.14 శాతంగా ఉండగా, ఈసారి ఫలితాల్లో నాలుగు శాతం వృద్ధి కనిపించింది. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా బాలికలే పైచేయి సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 87.90 గా నమోదు కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 82.68 గా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయని ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తెలిపారు. గతేడాది 72.8 శాతంగా ఉన్న ప్రభుత్వ పాఠాశాలల ఉత్తీర్ణత శాతం, ఈసారి ఏకంగా 78.39 శాతానికి పెరగడం విశేషం.
విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం, విద్యాశాఖ ఫలితాలను తెలుసుకోవడానికి పలు మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://results.bse.ap.gov.in ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అలాగే, 9552300009 నెంబర్‌కు వాట్సాప్‌లో 'హాయ్' అని మెసేజ్ పంపడం ద్వారా లేదా లీప్ (LEAP) మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు.
Also Read: టెన్త్ తరవాత డిప్లొమా కోర్స్ చేయొచ్చా, అవకాశాలు ఎలా ఉంటాయ్?
దీనితో పాటు ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఓపెన్ స్కూల్ ఫలితాలను https://apopenschool.ap.gov.in వెబ్‌సైట్‌లో లేదా 'మన మిత్ర' వాట్సాప్ నెంబర్ ద్వారా పొందవచ్చని నారా లోకేష్ తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
