ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2021 (పాలిసెట్‌) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర మంత్రి గౌతమ్‌ రెడ్డి ఏపీ పాలిసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది పాలిసెట్‌కు 74,884 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 68,208 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల్లో మొత్తం 64,187 మంది ఉత్తీర్ణత సాధించారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన కె.రోషన్ లాల్, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వివేక్ వర్ధన్ అనే ఇద్దరు మొదటి ర్యాంకును దక్కించుకున్నారు. పరీక్ష ఫలితాలను polycetap.nic.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. పాలిసెట్ పరీక్షను సెప్టెంబర్‌ 1న నిర్వహించారు. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని 72 వేల పాలిటెక్నిక్‌ సీట్లను భర్తీ చేయనున్నారు. ఫలితాల విడుదల అనంతరం మంత్రి గౌతమ్‌ రెడ్డి మాట్లాడుతూ.. వారం రోజుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులు తీసుకొస్తున్నామని.. ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా కల్పిస్తున్నట్లు వెల్లడించారు.


టాప్ 10 ర్యాంకర్లు వీరే.. 
ఈసారి మొదటి ర్యాంకును ఇద్దరు పంచుకున్నారు. దీంతో 1, 2 ర్యాంకులను ఇద్దరికీ కలిపి కేటాయించారు. ఇక మూడో ర్యాంకును ఏకంగా 9 మంది పంచుకున్నారు. దీంతో 3 నుంచి 11వ ర్యాంకు వరకు వీరికి కేటాయించారు. కల్లూరి రోషన్ లాల్ (విశాఖపట్నం), కొమరపు వివేక్ వర్ధన్ (పశ్చిమ గోదావరి) ఫస్ట్ ర్యాంకు సాధించారు. పొన్నాడ రాజశ్రీ (విశాఖపట్నం), బి. భవిత (కాకినాడ), గుడిమెట్ల మనోజ్ఞ (శామలకోట మండలం), సాయి సూర్య చందన శ్రీ తేజ (కండ్ర కోట), కర్రి గంగ ధన శ్రీ (పాలమూరు), మన్విత (రాజమండ్రి), రాయపాటి నాగ వంశీ కృష్ణ (తణుకు), చల్లగుండ్ల కార్తిక్ (నెల్లూరు), ఎద్దుల హేమంత్ (ప్రొద్దుటూరు) అనే తొమ్మిది మంది మూడో ర్యాంకును దక్కించుకున్నారు. 


ఈ ఏడాది ప్రశ్నపత్రంలో మార్పులు..
ఈ ఏడాది పాలిసెట్ ప్రశ్నపత్రంలో అధికారులు పలు మార్పులు చేశారు. పాలిసెట్ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. ఇంతకుముందు ఈ ప్రశ్నపత్రంలో.. మ్యాథ్స్ 60 మార్కులకు, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు 30 మార్కుల చొప్పున ఉండేవి. అయితే ఈసారి 50 మార్కులకు మ్యాథ్స్‌, 40 మార్కులకు ఫిజిక్స్‌, 30 మార్కులకు కెమిస్ట్రీ సబ్జెక్టులకు కేటాయించారు. గతంలో విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఏపీ పాలిసెట్ ఫలితాలు ఈ నెల 12 లోపే విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఫలితాల విడుదల వాయిదా పడింది. 


ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండిలా..



  • polycetap.nic.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.

  • ఇక్కడి మెనూలో ఉన్న పాలిసెట్ ర్యాంకు కార్డు (POLYCET Rank Card) అనే ఆప్షన్ క్లిక్ చేయండి. 

  • అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత వ్యూ ర్యాంక్ కార్డ్ (View Rank Card) ఆప్షన్ ఎంచుకోండి. 

  • కంప్యూటర్ స్క్రీన్ మీద మీ మార్కులు కనిపిస్తాయి. 

  • భవిష్యత్ అవసరాల కోసం వీటిని డౌన్‌లోడ్ చేసుకోండి. 


Also Read: JEE Main 2021 Results: జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదల.. ఆరుగురు తెలుగు విద్యార్థులకు ఫస్ట్ ర్యాంకు


Also Read: AP Inter Betterment Exams: ఏపీలో నేటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్‌.. నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ ఉంది