AP TET, Mega DSC 2024: ఏపీలో టెట్, డీఎస్సీ పరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్పటికే టెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. జులై 17 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు ఏపీటెట్ (జులై) పరీక్షలు నిర్వహించాలని మొదట విద్యాశాఖ షెడ్యూలు ఖరారుచేసింది. అయితే అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో.. ఈ రెండు పరీక్షలకు ప్రిపేపర్ అయ్యేందుకు మరింత సమయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే టెట్ నోటిఫికేషన్ వెలువడగా.. వారంరోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
ఒక్కో పరీక్షకు 90 రోజుల వ్యవధి..
ఏపీ టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు సమయం పెంచాలని రాష్ట్రంలోని ఉద్యోగార్థులు, పలువురు ప్రజాప్రతినిధులు విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ను ఇటీవల కలిసి విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి లోకేశ్.. విద్యాశాఖ ఉన్నతాధికారులతో జులై 3న సమీక్షించారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు టెట్ పరీక్షకు 90 రోజులు, మెగా డీఎస్సీ పరీక్షకు 90 రోజుల సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే పాఠశాల విద్యాశాఖ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కొత్తగా బీఈడీ, డీఎడ్ పూర్తి చేసుకున్న వారికీ మెగా డీఎస్సీలో అవకాశం కల్పించనున్నారు. ఏపీటెట్, డీఎస్సీ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రభుత్వం ప్రకటించనుంది. ఈ ఏడాది డిసెంబర్‌లోగా టీచర్ పోస్టులను భర్తీ చేసి, 2025 జనవరి నాటికి వారు ఉద్యోగాల్లో చేరేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించినట్లు సమాచారం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేసిన వెంటనే 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే.
ఏపీటెట్ దరఖాస్తు ప్రారంభం..
ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల అర్హత పరీక్ష 'ఏపీటెట్ జులై-2024' నోటిఫికేషన్ జులై 1న వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఏపీటెట్ ఫీజు చెల్లింపు ప్రక్రియ జులై 3న ప్రారంభంకాగా.. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 4న ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 16 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి జులై 17 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. పరీక్ష ఫీజు కింద అభ్యర్థులు ఒక్కో పేపరుకు (పేపర్-1ఎ, పేపర్-1బి, పేపర్-2ఎ, పేపర్-2బి) రూ.750 వేర్వేరుగా చెల్లించాల్సి ఉంటుంది. టెట్ పరీక్షలకు సంబంధించి ఒక్కో పేపరుకు 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు లేవు. పరీక్ష సమయం 2.30 గంటలు. పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 60 మార్కులు, బీసీలకు 50 మార్కులు, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులు-ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 40 శాతం ఉంటే సరిపోతుంది.
APTET July 2024 - నోటిఫికేషన్, పరీక్ష సిలబస్, పరీక్ష విధానం వివరాల కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్, వారికి ఫీజు మినహాయింపు
ఏపీలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 'మెగా డీఎస్సీ'లో ఫీజు మినహాయింపు ఇవ్వనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా 'మెగా డీఎస్సీ'ని పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..