ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించిన ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నవంబరు 6న ప్రారంభమైంది.  అభ్యర్థులు నవంబరు 6, 7 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నవంబరు 8న అర్ధరాత్రి 12 గంటల్లోపు ఆప్షన్లు మార్చుకునే వెసులుబాటు కల్పించారు. ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు అధికారులు నవంబరు 10న సాయంత్రం 6 గంటల తర్వాత సీట్లను కేటాయించనున్నారు. ఇప్పటి వరకు ఏ కేటగిరిలోనూ సీట్లు రాని విద్యార్థులు మాత్రమే ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. 


ఆప్షన్ల నమోదుకోసం క్లిక్ చేయండి..


ప్రత్యేక విడత కౌన్సెలింగ్ షెడ్యూలు..


➥ వెబ్ ఆప్షన్ల నమోదు: 06.11.2023 -  07.11.2023


➥ వెబ్ ఆప్షన్లలో మార్పులు: 08.11.2023


➥ సీట్ల కేటాయింపు: 10.11.2023


➥ సెల్ఫ్ రిపోర్టింగ్, కళాశాలలో రిపోర్టింగ్: 11.11.2023 - 13.11.2023


Notification


Counselling Website


రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో కలిపి 27 వేల వరకు సీట్లు ఉండగా.. వాటిలో ఎక్కువగా మెకానికల్, సివిల్, ఈఈఈ సీట్లే ఉన్నాయి. ఇంజినీరింగ్‌కు ఏటా మూడు విడతల కౌన్సెలింగ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో ప్రవేశాలు పొందిన వారికి ఫీజు రీయంబర్స్‌మెంట్ కల్పిస్తారు. కన్వీనర్ కోటాలో సీట్లు మిగిలితే కళాశాలల యాజమాన్యాలు స్పాట్ కోటా కింద భర్తీ చేసుకుంటాయి. 


ఈ ఏడాది ప్రభుత్వం రెండు విడతలు మాత్రమే నిర్వహించి, మిగిలిన సీట్లను స్పాట్ కింద భర్తీ చేసుకోవాలని యాజమాన్యాలకు సూచించింది. దీంతో యాజమాన్యాలు స్పాట్ కేటగిరిలో భర్తీ చేసుకున్నాయి. ఇప్పుడు విద్యార్థుల నుంచి డిమాండ్ వస్తుందంటూ ఎక్కడా సీట్లు రాని వారి కోసం మూడో విడత చేపట్టింది. మొదటి విడతలో ప్రవేశాలు పొందినవారికి సెప్టెంబరు మొదటి వారం నుంచే తరగతులు ప్రారంభమయ్యాయి. దాదాపు రెండు నెలల తరగతులు పూర్తయ్యాయి. దాంతో ఇప్పుడు మూడో విడతలో ప్రవేశాలు పొందినవారు అకడమిక్ పరంగా వెనుకబడే పరిస్థితి నెలకొంది.


ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాల్లో ఈ ఏడాది ఎన్నడూలేని విధంగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇంజినీరింగ్ ప్రవేశాలకు మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారనుకున్న అభ్యర్థులకు ఉన్నత విద్యామండలి షాకిచ్చిన సంగతి తెలిసిందే. మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను పక్కనపెడుతూ.. నేరుగా 'స్పాట్‌' ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీచేసింది. అక్టోబరు 4న ప్రారంభమైన స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ అక్టోబరు 18 వరకు కొనసాగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏటా మూడు విడతల కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది రెండు విడతల కౌన్సెలింగ్ మాత్రమే ఉన్నత విద్యామండలి నిర్వహించింది. దీనిపై విమర్శలు రావడంతో ఎట్టకేలకు కౌన్సెలింగ్ నిర్వహణకు ఉన్నత విద్యామండలి ఆమోదం తెలిపింది.


ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించకుండా స్పాట్ ప్రవేశాలు నిర్వహించడంపై ఉన్నత విద్యామండలి తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. ఎట్టకేలకు ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహణను ప్రారంభించింది. విద్యార్థులు నవంబరు 6 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇది వరకు కన్వీనర్ కోటా తర్వాత స్పాట్ కేటగిరి సీట్లు భర్తీ చేస్తుండగా.. ఇప్పుడు స్పాట్ తర్వాత కన్వీనర్ కోటా చేపట్టింది. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...