AP 10th Results 2022: ఏపీలో పదో తరగతి ఫలితాల విడుదల సోమవారానికి (జూన్ 6కు) వాయిదా వేశారు. జూన్ రెండో వారంలో విడుదల అవుతాయనుకున్న టెన్త్ రిజల్ట్స్ వారం ముందుగానే రిలీజ్ చేస్తామని ఇటీవల ప్రకటించారు. నేడు (జూన్ 4న) శనివారం ఉదయం ఏపీ టెన్త్ విద్యార్థుల బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ విజయవాడలో విడుదల చేయాల్సి ఉండగా.. సాంకేతిక సమస్యల కారణంగా ఫలితాల విడుదలను సోమవారం 11 గంటలకు వాయిదా వేసినట్లు చివరి నిమిషంలో ప్రకటించారు. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఆలస్యంగా అందుబాటులోకి వస్తాయని అధికారిక సమాచారం. ప్రస్తుత విధానానికి భిన్నంగా ఈసారి టెన్త్ ఫలితాలను గ్రేడ్లకు బదులు మార్కుల రూపంలో ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ఫలితాల్లో ర్యాంకులు ప్రకటించడకూడదని, ర్యాంకులను నిషేధిస్తున్నట్లు స్పష్టం చేశారు.


రిజల్ట్స్ ఈసారి గ్రేడ్లు కాదు..  
ఈ ఏడాది ఏపీ టెన్త్ క్లాస్ పరీక్షలు ఏప్రిల్ 27నుంచి మే 9వరకు జరిగాయి. రెండేళ్ల తరువాత రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు నిర్వహించగా.. దాదాపు 6,21,799 మంది విద్యార్థులు ఎగ్జామ్స్‌కు హాజరయ్యారు. ఏపీ టెన్త్ విద్యార్థుల బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ విజయవాడలో విడుదల చేయాల్సి ఉంది. కానీ సరైన ఏర్పాట్లు చేయని కారణంగా ఫలితాల విడుదల జూన్ 6కు వాయిదా పడింది. కొవిడ్‌ వ్యాప్తి కారణంగా రెండేళ్లు (2019 తర్వాత ) పరీక్షలు జరగలేదు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో విద్యార్థులకు ర్యాంకులు వచ్చినట్లు ఏ విధంగానూ ప్రచారం చేయకూడదని, ఈ సారి ఫలితాలను గ్రేడ్లకు బదులు మార్కుల రూపంలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. తమ సూచనలు పాటించకుండా ఏవైనా విద్యా సంస్థలు, స్కూళ్లు కనుక ర్యాంకులు ప్రకటిస్తే వారు చట్టరీత్యా శిక్షార్హులని హెచ్చరించారు. టెన్త్ విద్యార్థులు తమ ఫలితాలను శనివారం నాడు అధికారిక వెబ్‌సైట్ లో చెక్ చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ సూచించింది.


వారికి జరిమానా, జైలుశిక్ష..
రెండేళ్ల తరువాత నిర్వహించిన ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ ఫలితాల ప్రక్రియ సజావుగా జరగాలని రాష్ట్ర విద్యాశాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ర్యాంకుల ప్రకటనపై నిషేధం విధించింది. విద్యార్థులు గ్రేడ్లకు బదులుగా మార్కుల రూపంలో ఫలితాలు అందుకుంటారు. ర్యాంకుల ప్రకటనపై నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలు, యాజమాన్యాలపై 3 నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తామని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ పేర్కొన్నారు. ఈ మేరకు టెన్త్ ఫలితాల ప్రకటనపై జీవో జారీ చేశారు.