AP ECET 2024 | ఏపీలో బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సు రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన 'ఏపీఈసెట్-2024' పరీక్ష ఫలితాలను మే 30న విడుదల చేయనున్నారు. మే 30న ఉదయం అనంతపురం జేఎన్‌టీయూ ప్రాంగణలో ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఈసెట్ ఛైర్మన్ శ్రీనివాసరావు, కన్వీనర్ భానుమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఇతర వెబ్‌సైట్లలోనూ ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు. ఫలితాల విడుదల అనంతరం కౌన్సెలింగ్ తేదీలు వెల్లడించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మే 8న నిర్వహించిన ఈసెట్ పరీక్షకు మొత్తం 36,369 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏపీఈసెట్ ప్రాథమిక కీని, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను జేఎన్‌టీయూ అనంతపురం మే 10న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి మే 12 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఈ ప్రక్రియ ముగియడంతో ఫలితాల వెల్లడికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  


రేపే ఐసెట్ ఫలితాలు కూడా..
ఏపీలోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సు‌ల్లో ప్రవేశాలకు మే 6న ఏపీఐసెట్-2024 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలను కూడా మే 30న విడుదల చేయడానికి ఉన్నత విద్యామండలి సమాయత్తమవుతోంది. ఐసెట్ పరీక్షకు మొత్తం 48,828 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. అందులో 18,890 మంది బాలురు, 29,938 మంది బాలికలు ఉన్నారు. పరీక్షకు మొత్తం 44,446 మంది (91 శాతం) అభ్యర్థులు హాజరయ్యారు. మే 8న ఐసెట్ ప్రిలిమినరీ కీని విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి మే 10 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఫలితాలను మే 30న విడుదల చేయనున్నారు.


➥ ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో సంవత్సరం లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈసెట్-2024 నోటిఫికేషన్‌ (AP ECET 2024 Notification) మార్చి 14న విడుదలైన సంగతి తెలిసిందే. ఈసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ మార్చి 15న ప్రారంభమైంది. అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము లేకుండా ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రూ.500 ఆలస్యరుసుముతో  ఏప్రిల్ 22 వరకు, రూ.2000 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 29 వరకు, రూ.5000 ఆలస్యరుసుముతో  మే 12 వరకు స్వీకరించారు. పాలిటెక్నిక్ డిప్లొమా (ఇంజినీరింగ్), బీఎస్సీ (మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణత ఉన్నవారు ఈసెట్ పరీక్ష రాయడానికి అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకున్నారు. 


➥ ఆంధ్రప్రదేశ్‌లోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సు‌ల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్-2024 నోటిఫికేషన్ మార్చి 3న వెలువడిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 6న ప్రారంభమైంది. విద్యార్థుల నుంచి ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 7 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 8 నుంచి 12 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 13 నుంచి 17 వరకు, రూ.3000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 18 నుంచి 22 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అలాగే రూ.5000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 23 నుంచి 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇక దరఖాస్తు వివరాల్లో తప్పులుంటే సరిదిద్దుకునేందుకు ఏప్రిల్ 28, 29 తేదీల్లో అవకాశం కల్పించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 6న ఐసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను ఇప్పటికే విడుదల చేయగా.. మే 30న ఫలితాలను వెల్లడించనున్నారు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..