AP SET Answer Key: ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు నిర్వహించిన ఏపీసెట్(APSET)-2024 పేపర్-1, పేపర్-2 పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీని ఆంధ్రా యూనివర్సిటీ మే 1న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో సబ్జెక్టులవారీగా ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి సబ్జెక్టుల వారీగా ప్రిలిమినరీ కీ షీట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు మే 3న సాయంత్రం 4 గంటల్లోగా అభ్యంతరాలు తెలియజేయవచ్చు. అయితే అభ్యంతరాలు తెలిపే ఒక్కో ప్రశ్నకు రూ.200 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత ఫీజు చెల్లించి, గడువులోగా వచ్చిన అభ్యంతరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థులు తెలిపిన అభ్యంతరాలను నిపుణుల పరిశీలన తర్వాత ఫైనల్ ఆన్సర్ కీని అధికారులు విడుదల చేయనున్నారు.
ఏపీలో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కడప, కర్నూలు కేంద్రాల్లో ఏప్రిల్ 28న ఏపీసెట్-2024 పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 45,705 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. మొత్తం 38,078 (79.97%) మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు 7,627 మంది అభ్యర్థులు గైర్హజరయ్యారు.
పరీక్ష విధానం: ఏపీ సెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1(జనరల్ పేపర్)లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2(అభ్యర్థులకు సంబంధించిన సబ్జెక్టు)లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పేపర్-1కు 60 నిమిషాలు (గంట), పేపర్-2కు 120 నిమిషాల (2 గంటల) సమయం కేటాయించారు.
➥ పేపర్-1 పరీక్షను ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో నిర్వహించనుండగా.. పేపర్-2లో కామర్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ సబ్జెక్టులను ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో నిర్వహించనున్నారు. తెలుగు, ఉర్దూ, సంస్కృతం, హిందీ సబ్జెక్టులు తప్ప మిగతా సబ్జెక్టులను ఇంగ్లిష్‌లో మాత్రమే నిర్వహిస్తారు.
ఆన్సర్ కీ వెలువడిన సబ్జెక్టులు..
ఆంత్రోపాలజీ, హిస్టరీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్- అట్మాస్పియరిక్- ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జాగ్రఫీ, హిందీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్, లా, లైఫ్ సైన్సెస్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, మేనేజ్‌మెంట్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సంస్కృతం, సోషియాలజీ, సోషల్ వర్క్, తెలుగు, ఉర్దూ, విజువల్ ఆర్ట్స్.
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 10న ఏపీసెట్-2024 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 14 నుంచి మార్చి 14 వరకు ఎలాంటి ఆలస్యరుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరించింది. ఇక రూ.2000 ఆలస్యరుసుముతో మార్చి 25 వరకు, రూ.5000 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించింది. పరీక్ష ఫీజుగా జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1200 చెల్లించారు. బీసీ అభ్యర్థులు రూ.1000; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు రూ.700 చెల్లించారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఏప్రిల్ 19న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 28న ఏపీసెట్-2024 ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. రూ.5000 ఆలస్యరుసుముతో ఫీజు చెల్లించినవారికి కేవలం విశాఖపట్నం కేంద్రంలో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు.