Indrakaran Reddy Quits BRS Party: ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీని తాజాగా ఓ మాజీ మంత్రి వీడారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లారు. బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఇంద్రకరణ్ రెడ్డి.. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పంపించారు. కొంత కాలంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ అధిష్ఠానం మంతనాలు జరుపుతున్నారు. నేడు (మే 1) తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి దీపాదాస్ మున్షీ పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటూ వస్తున్నారు. పార్టీలో కీలకంగా వ్యవహరించిన వారు కూడా బీఆర్ఎస్ ను వీడుతున్నారు. తాజాగా ఈ మాజీ మంత్రి కూడా పార్టీకి రాజీనామా చేయడం.. బీఆర్ఎస్ కు మరింత నష్టం కలిగించింది.
కొంత కాలం క్రితం ఇంద్రకరణ్ రెడ్డి పెద్దన్న చనిపోవడంతో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శించేందుకు వచ్చారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరికపై చర్చలు జరిపారు. దీనికి ఇంద్రకరణ్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. అప్పుడే సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా ఇంద్రకరణ్ రెడ్డి పని చేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా ఇంద్రకరణ్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2014 నుంచి 2023 వరకూ రెండుసార్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా పని చేశారు. 1980 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఇంద్రకరణ్ రెడ్డి కొనసాగుతున్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా కూడా కొనసాగారు. 1991 నుంచి 1996 వరకు ఎంపీగా, 1999 నుంచి 2004 వరకు 11వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యుడిగా 2004 నుంచి 2008 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేగా ఉన్నారు. 2008 నుంచి 2009 వరకు 14వ లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు.