Telangana CM KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆయన రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ బ్యాన్ ఆయనపై నేడు రాత్రి 8 గంటల నుంచి ఉంటుందని స్పష్టం చేసింది. సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీపై అవమానకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆయనపై ఈ నిషేధం విధించినట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది.






సిరిసిల్లలో ఏప్రిల్‌ 5న కేసీఆర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ తో పాటు, తమ పార్టీ నేతలను ఉద్దేశించి అభ్యంతరకరంగా, అవమానకరంగా వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌ నేత నిరంజన్‌రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అది ఎన్నికల నియమావళికి పూర్తిగా విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో ఈసీ విచారణ చేపట్టింది. అనంతరం కేసీఆర్‌ నుంచి వివరణ కూడా సేకరించింది. స్థానిక అధికారులు తెలంగాణ మాండలికాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేక పోయారని కేసీఆర్ వివరణ ఇచ్చారు. దీనిపై ఎన్నికల సంఘం సంతృప్తి చెందలేదు. దీంతో ఎన్నికల కోడ్ ను కేసీఆర్ ఉల్లంఘించారని భావించి చర్యలు తీసుకుంది. మే 1న రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేయొద్దని స్పష్టం చేసింది.


కేసీఆర్‌ స్పందన ఇదే
తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఈసీ తీసుకున్న చర్యలపై కేసీఆర్ స్పందించారు. తన మాటలను ఎన్నికల అధికారులు సరిగా అర్థం చేసుకోలేదని.. ఇక్కడి భాషా మాండలికం ఢిల్లీలోని ఎన్నికల అధికారులకు అర్థం కాలేదని అన్నారు. కాంగ్రెస్‌ నేతలు కావాలనే ఈ ఫిర్యాదు చేశారని అన్నారు. తాను మాట్లాడిన మాటల్లో నుంచి కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకొని వాటిపైనే ఫిర్యాదు చేశారని అన్నారు. తన వ్యాఖ్యలను ఇంగ్లీషులోకి తర్జుమా చేయడం సరికాదని అన్నారు. తాను సిరిసిల్లలో కాంగ్రెస్‌ విధానాలు, హామీల అమల్లో ఫెయిల్యూర్ నే ప్రస్తావించానని అన్నారు. తన మాటలను కాంగ్రెస్‌ నేతలు వక్రీకరించి ఎన్నికల సంఘానికి సమర్పించారని కేసీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.