AP EDCET 2023 Counselling Schedule: ఏపీలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ (EDCET 2023 Counselling) షెడ్యూలును ఉన్నత విద్యామండలి (APSCHE) జనవరి 30న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 17 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఎడ్‌సెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 6 వరకు నిర్ణీత కౌన్సెలింగ్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అభ్యర్థులకు ఫిబ్రవరి 2 నుంచి 7 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. అయితే ప్రత్యేక కేటగిరి అభ్యర్థులకు జనవరి 5న విజయవాడలోని ఆంధ్రా లయోలా కాలేజీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. వీరికి ఫిబ్రవరి 14న వెబ్‌ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత ఫిబ్రవరి 17న మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందినవారు ఫిబ్రవరి 19 లోగా సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అదేరోజు నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 411 బీఈడీ కళాశాలల్లో మొత్తం 34 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి.
AP EDCET 2024 కౌన్సెలింగ్ షెడ్యూలు..
🔰 రిజిస్ట్రేషన్: 31.01.2024 - 06.02.2024.
🔰 సర్టిఫికేట్ వెరిఫికేషన్: 02.02.2024 - 07.02.2024.
🔰 సర్టిఫికేట్ వెరిఫికేషన్ (పీహెచ్/క్యాప్/ఎన్‌సీసీ/స్పోర్ట్స్ & గేమ్స్/ స్కౌట్స్ & గైడ్స్/ఆంగ్లో ఇండియన్స్): 05.02.2024.
🔰 వెబ్‌ఆప్షన్ల నమోదు: 09.02.2024 - 13.02.2024.
🔰 వెబ్‌ఆప్షన్ల మార్పులు: 14.02.2024.
🔰 మొదటి విడత సీట్ల కేటాయింపు: 17.02.2024.
🔰 సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్: 19.02.2024.
🔰 తరగతులు ప్రారంభం: 19.02.2024.
స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కేంద్రం:
HLC, Andhra Loyola College,
Sentini Hospital Road,
Veterinary Colony, Vijayawada.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్ ట్రైనింగ్ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఎడ్‌సెట్ 2023 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రవేశపరీక్షను జూన్ 14న ఆంధ్ర విశ్వవిద్యాలయం పరీక్ష నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 77 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 13,672 మంది దరఖాస్తు చేసుకోగా.. 11,235 (82.17 శాతం) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలను జులై 14న విడుదల చేయగా.. ఫలితాల్లో మొత్తం 10,908 (97.08 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఆంధ్రప్రదేశ్‌లో 18 బీఈడీ కళాశాలలకు అనుమతులు నిలిపివేస్తూ ఉన్నత విద్యాశాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఫీజులు నిర్ణయించని కారణంగా వాటిని కౌన్సెలింగ్ జాబితా నుంచి తొలగించారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు 30 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. వాయిదా వేశారు. దాంతో కౌన్సెలింగ్‌లో తీవ్ర జాప్యం జరిగింది. తాజాగా కౌన్సెలింగ్ షెడ్యూలును అధికారులు విడుదల చేశారు.
గతేడాది కూడా కౌన్సెలింగ్ ప్రక్రియ ఇలానే ఆలస్యం కావడంతో విద్యార్థులు దాదాపు ఏడాది సమయం కోల్పోయారు. ఇప్పుడు అక్టోబరు వచ్చినా ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే దానిపై స్పష్టత కొరవడింది. అది ఇలాగే కొనసాగితే ఈసారీ విద్యార్థులు విలువైన సమయాన్ని కోల్పోయే అవకాశం ఉంది.