AP TET July 2024 Syllabus: ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి మెగా డీఎస్సీ కంటే ముందుగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2024) నోటిఫికేషన్‌ను విద్యాశాఖ జులై 1న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నోటిఫికేషన్, ఇన్‌ఫర్మేషన్ బులిటెన్, పరీక్ష షెడ్యూల్, సిలబస్ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అయితే టెట్(జులై)-2024 పరీక్షకు పాత సిలబస్ ఉంచినట్లుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ జులై 2న స్పష్టతనిచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదని తెలిపారు. దీనిపై అభ్యర్థులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని సూచించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన టెట్ (ఫిబ్రవరి)-2024 పరీక్షకు నిర్ణయించిన సిలబస్‌నే ప్రస్తుత టెట్‌కు కూడా నిర్థారించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం అదే సిలబస్‌ను వెబ్‌సైట్‌లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు. ఈ సిలబస్ ఆధారంగానే అభ్యర్థులు టెట్ పరీక్షకు సిద్ధం కావాలని సూచించారు.


జులై 3 నుంచి టెట్ ఫీజులు, 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ..
ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీటెట్ జులై (APTET July)-2024 నోటిఫికేషన్ జులై 1న వెలువడిన సంగతి తెలిసిందే. పరీక్షకు సంబంధించిన పూర్తివివరాలను జులై 2న అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు జులై 3 నుంచి 16 వరకు ఫీజు చెల్లించి, జులై 4 నుంచి 17 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజు కింద ఒక్కో పేపరుకు (పేపర్-1ఎ, పేపర్-1బి, పేపర్-2ఎ, పేపర్-2బి) రూ.750 వేర్వేరుగా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థుల సౌకర్యార్ధం జులై 16 నుంచి మాక్ టెస్టలులు రాసేందుకు అవకాశం కల్పించారు. టెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జులై 25 నుంచి హాల్‌‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


ఆగస్టు 5 నుంచి టెట్ నిర్వహణ..
పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు జరుగనున్నాయి. ఆయారోజుల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో టెట్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. టెట్ ప్రాథమిక 'కీ' ఆగస్టు 10న విడుదల చేయనున్నారు. ఆన్సర్ కీపై ఆగస్టు  11 నుంచి 21 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం ఆగస్టు 25న టెట్ తుది ఆన్సర్ కీని విడుదల చేయనున్నారు. టెట్‌ తుది ఫలితాలను ఆగస్టు 30న విడుదల చేయనున్నారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తున్న సంగతి తెలిసిందే. 


ముఖ్యమైన తేదీలు..


➥ ఏపీటెట్ జులై -2024 నోటిఫికేషన్ వెల్లడి: 02.07.2024.


➥ దరఖాస్తు ఫీజు చెల్లింపు తేదీలు: 03.07.2024 -16.07.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.07.2024 - 17.07.2024.


➥ ఆన్‌లైన్ మాక్ టెస్టులు అందుబాటులో: 16.07.2024 నుంచి.


➥ టెట్ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 25.07.2024 నుంచి 


➥ టెట్ పరీక్ష షెడ్యూలు: 05.08.2024 - 20.08.2024.  {పేపర్-1(ఎ) & పేపర్-1(బి), పేపర్-2(ఎ) & పేపర్-2(బి)}


➥ పరీక్ష సమయం..


సెషన్-1: ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.


సెషన్-2: మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు


➥ టెట్ ప్రాథమిక 'కీ' విడుదల: 10.08.2024.


➥ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 11.08.2024 - 21.08.2024.


➥ టెట్ ఫైనల్ కీ: 25.08.2024.


➥ టెట్ ఫలితాల వెల్లడి: 30.08.2024.


APTET July 2024 - నోటిఫికేషన్, పరీక్ష సిలబస్, పరీక్ష విధానం వివరాల కోసం క్లిక్ చేయండి..








మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..