ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని అరికట్టేందుకు విద్యాశాఖ మరో సర్క్యూలర్‌ను జారీ చేసింది. ఈ మేరకు పరీక్షా కేంద్రాలను నో-ఫోన్ జోన్‌లుగా ప్రకటించింది. చీఫ్ సూపరింటెండెంట్ల ఫోన్లకు కూడా అనుమతి నిరాకరించింది. పరీక్షా కేంద్రాల్లో ఫోన్లు సహా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కనిపిస్తే వెంటనే తీసుకుంటామని హెచ్చరించింది. 


లీకేజీలను అరికట్టేందుకు మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంది ప్రభుత్వం. ప్రశ్నాపత్రంలోని ప్రతి పేజీ మీద సెంటర్ నంబర్, రోల్ నంబర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇన్విజిలేటర్లను ఆదేశించింది. ప్రశ్నాపత్రాలు ఇవ్వగానే అభ్యర్థులతో నంబర్‌లు రాయించాలని సూచించింది. పరీక్షా కేంద్రాల్లో తప్పిదాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.


పదో తరగతి పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి లీకుల బెడద ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. రోజూ పరీక్ష ప్రారంభమైన కాసేపటికే ప్రశ్నాపత్రాలు బయటకు రావడం చాలా సమస్యగా మారింది. ఇప్పటికే సెల్‌ఫోన్లు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి నిరాకరించింది. అయినా లీకులకు అడ్డుకట్ట పడలేదు. దీంతో మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. 


ఇప్పటికే లీకేజీలతో సంబంధం ఉన్న ఉపాధ్యాయులను, నాన్‌టీచింగ్ స్టాఫ్‌పై కేసులు రిజిస్టర్ చేసింది. స్కూల్స్‌పై కూడా కేసులు పెట్టింది. అరెస్టులు కూడా జరిగాయి. ఎంత కఠినంగా ఉంటున్నా... లీకువీరుల ఆగడం లేదు. క్షణాల్లో పరీక్ష పత్రాన్ని వాట్సాప్‌లో సర్క్యులేట్ చేస్తున్నారు. దీంతో పరీక్ష కేంద్రాలను నో ఫోన్ జోన్స్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది. 


ఏపీలో టెన్త్ క్లాస్ మ్యాథ్స్ పరీక్షా పత్రాల మాల్ ప్రాక్టీస్ వ్యవహారంలో తీగలాగితే డొంక కదులుతోంది. పరీక్ష ప్రారంభానికి ముందే పశ్నాపత్రాన్ని టీచర్లు బయటకు తీసుకొచ్చారని గుర్తించారు. ఏలూరు జిల్లా మండవల్లి హైస్కూల్ టీచర్లు, సిబ్బంది ఈ పేపర్ లీక్ చేసినట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు ఇంగ్లీష్ టీచర్ మేడేపల్లి జాన్ విల్సన్‌‌ను కీలక సూత్రధారిగా తేల్చారు. మేడేపల్లి జాన్ విల్సన్ అనే టీచర్ క్వశ్ఛన్ పేపర్‌ను ఎగ్జామ్ టైమ్ కంటే ముందుగానే బయటకు తెచ్చి సమాధానాలు తయారు చేసినట్లు గుర్తించారు.


ఈ టీచర్లు, స్టాఫ్ అటెండర్ మహ్ముద్ ఫాతిమా సహాయంతో ఆన్సర్ పేపర్లు పంపించి మరీ మాస్ కాపీయింగ్ చేయిస్తూ అడ్డంగా బుక్కయ్యారు. విద్యా బుద్ధలు నేర్పించాల్సిన వాళ్లే పిల్లలను అడ్డదారిలో నడిపించడంపై విమర్శలు వస్తున్నాయి. ఆ టీచర్లు వాట్సాప్ ద్వారా జవాబు పత్రాలను కృష్ణా జిల్లాలోని పామర్రు, నందివాడ, గుడివాడలోని పరీక్షా కేంద్రాలకు పంపించారని గుర్తించారు.  ఎగ్జామినేషన్ సెంటర్ సూపరింటెండెంట్ గోపాలకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన మండవల్లి పోలీసులు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఆరుగురు టీచర్లు, ముగ్గురు స్కూల్ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. అన్సర్ షీట్లు ప్రింట్ చేస్తున్న ప్రింటర్‌తో పాటు వారి మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.


Also Read: Viral Video: అనంతపురం జిల్లాలో విద్యార్థుల వింతచేష్టలు, స్కూల్‌లో ఫర్నీచర్ ధ్వంసం, సోషల్ మీడియాలో వీడియో వైరల్‌


Also Read: AP SSC Exam: పదో తరగతి ఎగ్జామ్ పేపర్ లీక్‌పై ఏపీ విద్యాశాఖ కీలక ప్రకటన- వాళ్లపై చర్యలు తప్పవని హెచ్చరిక