ఈ మధ్య తమిళనాడులో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. క్లాస్‌లో టీచర్ పాఠాలు చెబుతున్నప్పుడే కొందరు విద్యార్థులు డ్యాన్స్‌లు చేయడం, బెంచ్‌లు విరగ్గొట్టే విజువల్స్‌ సోషల్ మీడియా చక్కర్లు కొట్టాయి. దీన్ని చూసిన చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇలాంటి విద్యార్థుల భవిష్యత్‌ ఏంటని నెటిజన్లు కామెంట్స్ చేశారు. 


దాని నుంచి స్ఫూర్తి పొందారో ఏమోగానీ అనంతపురం జిల్లాలో అలాంటి సంఘటనే జరిగింది. తమిళనాడులో చూసిన దృశ్యాల కంటే భయానకంగా ఉన్నాయీ వీళ్ల చేష్టలు. పండగ మచ్చా అంటూ వాళ్లు చేసిన రచ్చకు ఊరి ప్రజలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అంతా తలదించుకోవాల్సి వస్తోంది. 


నల్లమడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల చేసిన రచ్చ ఇప్పుడు వైరల్‌గా మారింది. పదో తరగతి పరీక్షలు రాసిన అనంతరం కొంత మంది ఆకతాయి విద్యార్థులు వికృత చేష్టలకు పాల్పడ్డారు. చాలా చోట్ల పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న వసతులను విద్యార్థులు ధ్వంసం చేశారు. 


పెనుగొండలో ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్యాను విరిగిపడి విద్యార్థిని తీవ్రగాయాల పాలైంది. ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో నాడు నేడు కింద ప్రభుత్వము అన్ని సౌకర్యాలు పాఠశాల కల్పించింది. వారి చదువు కోసం కోట్లు ఖర్చు పెట్టి కార్పొరేట్‌ స్థాయిలో ఫెసిలిటీస్‌ ఇచ్చింది. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన విద్యార్థులు ఇలా విధ్వంసానికి పాల్పడుతున్నారు. 


నల్లమడ జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల చేసిన విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువగానే అనిపిస్తుంది. పట్టుమని పదిహేను ఏళ్లు లేని విద్యార్థులు రెచ్చిపోయారు. ఫ్యాన్లు ధ్వంసం చేశారు. పుస్తకాలు, ప్లేట్లను తిరుగుతున్న ఫ్యాన్స్‌పైకి విసిరారు. మరికొందరు పెద్ద పెద్ద రాడ్లు పట్టుకొని తిరుగుతన్న ఫ్యాన్లను ధ్వంసం చేశారు. తరగతి గదుల్లో ఉన్న విద్యుత్ బల్బులను కూడా పగుల గొట్టారు. పక్కనే అమ్మాయిలు ఉన్నారు. వాళ్లకు తగులుతుందన్న స్పృహ కూడా లేకుండా ఈ విధ్వంసంకాండ కొనసాగించారు.  



విద్యార్థులు చేసిన ఈ విధ్వంస కాండ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 15 ఏళ్ల లోపు పిల్లల వింతపోకడ ఆశ్చర్యానికి గురి చేసింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఇతర సిబ్బంది దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులకు కూడా సమాచారం అందించారు. 


 జరిగిన తప్పిదానికి విద్యార్థుల తల్లిదండ్రులు క్షమాపణ చెప్పారు. ఈసారికి తమ బిడ్డలను వదిలేయాలని ప్రాధేయపడ్డారు. జరిగిన నష్టాన్ని తామే భరిస్తామని అంగీకరించారు. గొడవ పెద్దదైతే పిల్లల భవిష్యత్‌కు నష్టమని వేడుకున్నారు. ఉపాధ్యాయులు, పోలీసులు కూడా అదే కరెక్టని భావించారు. మానవతా దృక్పథంతో వదిలేస్తున్నట్టు హెడ్‌మాస్టర్‌ చెప్పారు. ఇలాంటివి రిపీట్ అయితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు కూడా హెచ్చరించారు.