అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) పరీక్షలు నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంజనీరింగ్ అభ్యర్థులకు నేటి నుంచి ఆగస్టు 20, 23, 24, 25 తేదీల్లో.. ఫార్మసీ, అగ్రికల్చర్ అభ్యర్థులకు సెప్టెంబరు 3, 6, 7 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఒక్కో కేంద్రంలో 200 నుంచి 250 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఈఏపీసెట్ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహిస్తున్నారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్ష ప్రారంభం అయ్యాక ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షకు నిర్ధేశించిన సమయం కంటే కనీసం రెండున్నర గంటలు ముందుగా విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
మొత్తం 120 పరీక్ష కేంద్రాలు..
ఈఏపీసెట్ పరీక్షల కోసం ఆంద్రప్రదేశ్, తెలంగాణల్లో కలిపి మొత్తం 120 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. గుంటూరు నగరం సహా ఇతర ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జేఎన్‌టీయూ (కాకినాడ) ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ రోజు పరీక్షకు ఇంజనీరింగ్ విభాగాల పరీక్ష కోసం మొత్తం 15 వేల మందికిపైగా విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇక అగ్రికల్చరల్, ఫార్మసీ విభాగాల పరీక్ష కోసం దాదాపు 3 వేల మంది హాజరుకానున్నారు.
ప్రాథమిక 'కీ' ఆగస్టు 25న..
ఇంజనీరింగ్ ప్రాథమిక 'కీ'ని ఆగస్టు 25న.. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ప్రాథమిక 'కీ'ని సెప్టెంబర్ 7వ తేదీన విడుదల చేస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఈ పరీక్షల కోసం మొత్తం 2,59,156 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వారిలో 1,75,796 మంది ఇంజనీరింగ్‌ను.. 83,051 మంది అగ్రికల్చర్‌ను ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. 717 మంది విద్యార్థులు ఇంజనీరింగ్, అగ్రికల్చర్ రెండింటినీ ఎంచుకున్నారని వివరించారు.
కోవిడ్ పాజిటివ్ వారికి ప్రత్యేక సెషన్..
కోవిడ్ పాజిటివ్ విద్యార్థులకు పరీక్షలకు అనుమతించబోమని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. వీరికి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. కోవిడ్ పాజిటివ్ ఉన్న వారి హెల్త్ సర్టిఫికెట్లను పరిశీలించి.. ఈఏపీసెట్ పరీక్షను ప్రత్యేక సెషన్లలో నిర్వహిస్తామని వెల్లడించారు.
Also Read: AP Schools: ఏపీలో 10 గంటల బడి... 2021-22 అకడమిక్ క్యాలెండర్ విడుదల... పండగ సెలవులు ఎప్పుడంటే...
Also Read: AP LPCET 2021: ఏపీలో లాంగ్వేజ్ పండిట్ కోర్సు ప్రవేశాలు.. ఎల్‌పీసెట్ నోటిఫికేషన్ విడుదల..