తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. రెండు రాష్ట్రాల్లోనూ పాఠశాలలకు సెలవుల తేదీలను ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించాయి. దీంతో ఆ తేదీల కంటే ముందే సొంతూళ్లకు పయనమయ్యారు. ఏపీలోని పాఠశాలలకు జనవరి 12 నుంచి 18 వరకు.. ఏడు రోజులపాటు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. పాఠశాలలు తిరిగి జనవరి 19న ప్రారంభంకానున్నాయి. మొదట జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని భావించినప్పటికీ.. ఉపాధ్యాయ సంఘాల నుంచి దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సంక్రాంతి సెలవులు కేవలం ఆరు రోజులు మాత్రమే ఇచ్చారని, ఇవి సరిపోవని, ముఖ్యంగా 16న కనుమ పండుగ తర్వాత రోజునే స్కూళ్లకు, కాలేజీలకు రావాలంటే సొంత గ్రామాకు వెళ్లిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎంతో ఇబ్బంది అవుతుందని తెలిపాయి. కనీసం 18వ తేదీ వరకు సెలవులు పొడిగించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి.
ఏపీలోని పాఠశాలలకు జనవరి 12 నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. కనుమ రోజుతో కలిపి మొత్తం ఏడు రోజులు సెలవులుంటాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్‌కుమార్ శనివారం (జనవరి 7న) ఉత్తర్వులు విడుదల చేశారు. అకడమిక్ కాలెండర్ ప్రకారం జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో జనవరి 17న ముక్కనుమ ఉన్నందున సెలవు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు మంత్రి బొత్స సత్యనారాయణకు వినతి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో కనుమతో కలిపి మొత్తం 7 రోజులు సంక్రాంతి సెలవులుగా ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అదనంగా ఇచ్చిన కనుమ రోజు సెలవును మరో సెలవు రోజులో పాఠశాల నిర్వహించి భర్తీ చేయాలని పేర్కొంది.
ఏపీలోని జూనియర్ కాలేజీలకు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. అయితే పాఠశాలలకు జనవరి 12 నుంచి 18 వరకు సెలవులు ఇస్తుండటంతో.. కాలేజీలకు కూడా ఇవే సెలవులు ఉండే అవకాశం ఉంది. ఇంటర్ బోర్డు నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
వీరికి 12 రోజుల సెలవులు..
ఏపీలోని ఆర్టీయూకేటీ పరిధిలోని ట్రిపుల్ ఐటీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు జనవరి 7 నుంచి 18 వరకు అంటే మొత్తం 12 రోజులపాటు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. జనవరి 19 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.
తెలంగాణ సంక్రాంతి సెలవులు ఇలా..
తెలంగాణలో పాఠశాలలకు, కాలేజీలకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. పాఠశాలలకు 5 రోజులపాటు, కాలేజీలకు 3 రోజులపాటు సెలవులు ఉంటాయని వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలకు జనవరి 13 నుంచి 17 వరకు 5 రోజుల సంక్రాంతి సెలవులు ఇచ్చారు. జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగ ఉండగా.. జనవరి 17న కూడా సెలవురోజుగా ప్రకటించారు. దీంతో జనవరి 18న పాఠశాలలు పున:ప్రారంభమవుతాయి.
కాలేజీలకు మూడు రోజులే..
ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలకు జనవరి 14 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ఇచ్చింది. పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. తిరిగి ఈ నెల 17న తరగతులు పునః ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యామండలి సెక్రెటరీ నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు. సెలవుల్లో జూనియర్ కాలేజీల్లో తరగతులు నిర్వహించొద్దని ఆదేశించారు. ఎక్కడైనా తరగతులు నిర్వహించినట్లు దృష్టికి వస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.