ఏపీలోని డిగ్రీ కళాశాలల్లో 'సింగిల్‌ సబ్జెక్టు' మేజర్‌గా కొత్త కరిక్యులమ్‌ను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఇప్పటివరకు డిగ్రీలో మూడు సబ్జెక్టులు ప్రధాన కాంబినేషన్‌తో విద్యాబోధన సాగుతుండగా ఇకపై ఒక మేజర్‌ సబ్జెక్టు ప్రధానంగా డిగ్రీ విద్య కొనసాగనుంది. జూన్‌ నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇప్పటికే విడుదలైంది. ఈ మేరకు కరిక్యులమ్‌లో మార్పులు చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో బుధవారం (మే 10)  చైర్మన్‌ ఫ్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, వైస్‌ చైర్మన్‌ రామ్మోహన్‌రావు మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ‘సెట్స్‌’ స్పెషల్‌ ఆఫీసర్‌ సుధీర్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్‌ అహ్మద్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


వివరాలు ఇలా..


➥ డిగ్రీలో బీఎస్సీ–ఎంపీసీ (మూడు సబ్జెక్టుల కాంబినేషన్‌) ఉండగా.. కొత్త విధానంలో ప్రకారం ఆ స్థానంలో బీఎస్సీ మ్యాథ్స్‌/ఫిజిక్స్‌/కెమిస్ట్రీలో ఒక సబ్జెక్టును మేజర్‌గా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రెండో సెమిస్టర్‌ నుంచి దాదాపు 100 కోర్సుల నుంచి విద్యార్థులు తమకు నచ్చిన విభాగంలో మైనర్‌ సబ్జెకున్టు ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించారు. తద్వారా మేజర్, మైనర్‌ సబ్జెక్టుల్లో ఏదో ఒకదానితో పీజీ విద్యను అభ్యసించేలా మార్పులు చేసినట్లు చెప్పారు. 


➥ డిగ్రీలో మేజర్‌ సబ్జెక్టుతో పాటు కచ్చితంగా ఒక మైనర్‌ సబ్జెక్టు చదవాలి. ఉదాహరణకు ఒక సైన్స్‌ విద్యార్థి మైనర్‌ సబ్జెక్టుగా ఎకనామిక్స్, హిస్టరీ, మ్యూజిక్, యోగా, డేటాసైన్స్, మార్కెటింగ్‌.. ఇలా ఇతర సబ్జెక్టులను ఎంపిక చేసుకోవచ్చు. ఆర్ట్స్‌ విద్యార్థులు  మైనర్‌లో (ఇంటర్మీడియట్‌ కోర్సుల ఆధారంగా) నచ్చిన సబ్జెక్టు తీసుకోవచ్చు.


➥ కొత్త విధానాన్ని బీఎస్సీతో పాటు బీఏ, బీకామ్‌ డిగ్రీలో అమలు చేయనున్నారు. డిగ్రీ విద్యలో ఉద్యోగ అవకాశాలను పెంపొందించడంతో పాటు ఇంజినీరింగ్‌తో సమానంగా తీర్చిదిద్దేందుకు ఈ విద్యా సంస్కరణలు దోహదం చేయనున్నాయి. వచ్చే జూన్‌లో కొత్త కరిక్యులమ్‌ ప్రకారం ప్రవేశాలు ఉంటాయి. దీనిపై డిగ్రీలో చేరే విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తారు. 


నాలుగో ఏడాది డిగ్రీకి అనుమతి..
జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం దేశంలో తొలిసారి విద్యా సంస్కరణలను ఏపీలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూడో ఏడాది డిగ్రీ విద్య పూర్తయింది. యూజీసీ ఫ్రేమ్‌ వర్క్స్‌ ప్రకారం ఆనర్స్‌ డిగ్రీని రెండు రకాలుగా విభజించారు. మూడేళ్ల డిగ్రీలో 75 శాతం మార్కులు సాధించినవారు రిసెర్చ్‌ ఆనర్స్‌ డిగ్రీ కోర్సులో చేరవచ్చు. ఇది పూర్తి చేసినవారు పీజీ లేకుండానే పీహెచ్‌డీ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. మూడేళ్ల కోర్సులో ఉత్తీర్ణులైతే జనరల్‌ ఆనర్స్‌ కోర్సును అభ్యసించవచ్చు. ఇది పూర్తిచేసిన వారు పోస్టు గ్రాడ్యుయేషన్‌ రెండో ఏడాదిలో చేరవచ్చు. ఆనర్స్‌ కోర్సులను అందించేందుకు ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో గత మూడేళ్లలో వరుసగా 30 శాతం అడ్మిషన్లతో పాటు సంబంధిత కోర్సుల్లో ఇద్దరు డాక్టరేట్‌ కలిగిన ప్రొఫెసర్లు ఉంటేనే అనుమతులు మంజూరు చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఫ్రొఫెసర్ హేమచంద్రారెడ్డి తెలిపారు. 


డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి..
నూతన విద్యావిధానంలో భాగంగా డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను ఏపీ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇంజనీరింగ్‌ తదితర ప్రొఫెషనల్‌ కోర్సులకు ఇంటర్న్‌షిప్‌ ఉన్నట్టుగానే నాన్‌ ప్రొఫెషనల్‌ డిగ్రీ కోర్సుల విద్యార్థులకు కూడా 10 నెలల ఇంటర్న్‌షిప్‌ ప్రవేశపెట్టారు. మైక్రోసాఫ్ట్‌ ద్వారా ఏడాదిలో 1.20 లక్షల సర్టిఫికేషన్‌ కోర్సులను అందిస్తుండటం దేశంలోనే తొలిసారి కావడం విశేషం.




ఏడాది కలిసొస్తుందోచ్..
ప్రస్తుతం పీహెచ్‌డీ ప్రవేశం పొందాలంటే డిగ్రీ తర్వాత రెండేళ్ళ పీజీ పూర్తి చేయాల్సి ఉంది. నాలుగేళ్ల ఆనర్స్‌ తర్వాత పీహెచ్‌డీ ప్రవేశం పొందితే ఏడాది కలిసొస్తుంది. ప్రైవేటు కాలేజీలలో నాలుగేళ్ల డిగ్రీని నిర్వహించాలంటే మూడేళ్లల్లో 30 శాతం సీట్లు భర్తీ అయి ఉండాలని నిబంధన విధించారు. ఆనర్స్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహించాలంటే ఆయా సబ్జెక్టుల్లో కనీసం ఇద్దరు పీహెచ్‌డీ అర్హత కలిగిన అధ్యాపకులు ఉండాలని పేర్కొన్నారు. ఈ నిబంధనల మేరకు సిబ్బందిని భర్తీ చేయకపోతే ప్రైవేటులో మూడేళ్ల డిగ్రీనే కొనసాగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.





ఆనర్స్‌ కోర్సుల్లో విద్యార్థికి మొదటి, రెండో సెమిస్టర్‌లో రెండు మేజర్‌ సబ్జెక్టులు ఉంటాయి. వీటితోపాటు రెండు లాంగ్వేజ్‌ సబ్జెక్టులు, నైపుణ్యాభివృద్ధి, బహుళ కోర్సులు ఉంటాయి. వేసవి సెలవుల్లో రెండు నెలలు ప్రాజెక్టు వర్క్‌ చేయాలి. మూడో సెమిస్టర్‌లో నాలుగు మేజర్‌, విద్యార్థి ఎంపిక చేసుకున్న మైనర్‌ సబ్జెక్టు ఉంటాయి. నాలుగో సెమిస్టర్‌కు వచ్చేసరికి రెండు మైనర్‌, మూడు మేజర్‌ సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. రెండు నెలలు ఇంటర్న్‌షిప్‌ చేయాలి.








ఐదో సెమిస్టర్‌లో రెండు మైనర్‌, నాలుగు మేజర్‌ సబ్జెక్టులు, ఆరో సెమిస్టర్‌‌లో ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. ఒకవేళ ఐదో సెమిస్టర్‌లో ఇంటర్న్‌షిప్‌ చేస్తే ఆ సబ్జెక్టులను ఆరో సెమిస్టర్‌లో ఉంటాయి. ఏడు, ఎనిమిదిలో మైనర్‌ సబ్జెక్టులు ఉండవు. అయిదేసి మేజర్‌ సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. ఇంటర్న్‌షిప్‌ 10 నెలలకు మొత్తం 20 క్రెడిట్లు ఇస్తారు. మేజర్‌ సబ్జెక్టులకు 60 క్రెడిట్లు, మైనర్‌కు 24 క్రెడిట్లు ఉంటాయని ఏపీ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.







'సింగిల్‌ సబ్జెక్టు' కోర్సులకు నోటిఫికేషన్ వెల్లడి, వివరాలు ఇలా..
ఏపీలోని డిగ్రీ కాలేజీల్లో రానున్న విద్యాసంవత్సరం (2023-24) నుంచి సింగిల్ సబ్జెక్టు డిగ్రీ కోర్సులను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకునేందుకు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న మూడు ప్రధాన సబ్జెక్టుల కోర్సుల నుంచి సింగిల్‌ సబ్జెక్టుకు మారేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం ప్రాసెస్‌ ఫీజు కింద ఒక్కో కళాశాల రూ.5 వేలు చెల్లించాలని, పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచామని తెలిపింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..