ఉద్యోగం చేస్తూ దూరవిద్య ద్వారా చదువుకోవాలనుకునే వారికి శుభవార్త. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (Ambedkar Open University) డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించింది. 2021 సంవత్సరానికి గానూ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. అండర్ గ్రాడ్యుయేట్, పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు కావాల్సిన అర్హతలు, దరఖాస్తు వివరాలు, ముఖ్యమైన తేదీలను వెల్లడించింది. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు.. పీజీలో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ (BLISc), ఎంఎల్‌ఐఎస్సీ (MLISc) సహా పలు సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
దరఖాస్తు ప్రక్రియ
దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో స్వీకరిస్తోంది. దరఖాస్తుల స్వీకరణ జూన్ 23వ తేదీన ప్రారంభం అవ్వగా.. ఆగస్టు 12వ తేదీతో ముగియనుంది. దరఖాస్తు ఫీజును రూ.200గా నిర్ణయించింది. మరిన్ని వివరాలను https://www.braouonline.in/ వెబ్‌సైట్‌లో పొందవచ్చు. వీటితోపాటుగా 2021-22 విద్యా సంవత్సరంలో ఫస్టియర్‌లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు సెకండియర్ ట్యూషన్ ఫీజును, అంతకుముందు చేరిన విద్యార్థుల్లో సకాలంలో చెల్లించలేకపోయిన వారు కూడా ఆగస్టు 12వ తేదీ లోగా ట్యూషన్ ఫీజును ఆన్‌లైన్ విధానంలో చెల్లించాలని నోటిఫికేషన్ లో పేర్కొంది.
విద్య అర్హతలు
అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ (డిగ్రీ) కు 10+2 / ఇంటర్మీడియట్ / ఐటీఐలో ఉత్తీర్ణత సాధించాలి. బీఏ, బీకాం, బీఎస్సీ - తెలుగు / ఇంగ్లిష్ మీడియం, బీఏ, బీఎస్సీ - ఉర్దూ మీడియంలలో ఉన్నాయి. ఇక పీజీ కోర్సులైన ఎంఏ / ఎంఎస్సీ / ఎంకాంలకు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతను అర్హతగా పేర్కొంది. ఇవి కూడా తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో ఉన్నాయి.
పరీక్ష తేదీలు ఖరారు
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగే పలు పరీక్షల తేదీలను వర్సిటీ అధికారులు ప్రకటించారు. డిగ్రీ (సీబీసీఎస్) 4వ సెమిస్టర్ పరీక్షలు జూలై 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు, డిగ్రీ 2వ సెమిస్టర్ పరీక్షలను జూలై 9 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపారు. మూడేళ్ల డిగ్రీ కోర్సు పాత బ్యాచ్‌ల పరీక్షలను జూలై 16 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బీఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) ప్రవేశ పరీక్షను జూలై 18న, ఎంబీఏ ( హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్) ఫస్టియర్ రెండో సెమిస్టర్ పరీక్షలను జూలై 16 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నారు. యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. వాస్తవానికి ఈ పరీక్షలను మార్చి 25వ తేదీన మొదలు పెట్టి ఏప్రిల్‌లో ముగించాలని అధికారులు అనుకున్నారు. కానీ కరోనా కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి.