AP Govt On Private Schools : పదో తరగతి ఫలితాలు విడుదలైతే చాలు ఒకటి, ఒకటి , ఒకటి, రెండు, రెండు, అంటూ ప్రైవేట్ విద్యాసంస్థలు ర్యాంకుల పేరుతో టీవీల్లో, పేపర్లో ఊదరగొడతాయి. ఇలా యాడ్స్ ఇస్తూ వచ్చే ఏడాది సీట్లు భర్తీ చేసుకోవాలని ఆ విద్యాసంస్థలు భావిస్తాయి. ర్యాంకుల పేరుతో ఊదరగొట్టే ప్రైవేట్ విద్యా సంస్థలు, ట్యూటోరియల్ సంస్థలపై చర్యలు తప్పవని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది. ర్యాంకుల ప్రకటనపై నిబంధనలు ఉల్లంఘించిన సంస్థల యాజమాన్యాలపై మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తామని పేర్కొంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రయోజనాల దృష్ట్యా ఎస్ఎస్సీ పరీక్షల్లో ర్యాంకులతో ప్రకటనలు జారీ చేయడాన్ని నిషేధిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ జీవో జారీ చేశారు. 


గ్రేడ్లకు బదులు మార్కులు 


పదో తరగతి పరీక్షల్లో గతంలో గ్రేడింగ్ విధానంలో ఫలితాలు ప్రకటించేవారు. కానీ 2020 నుంచి గ్రేడ్లకు బదులు మార్కుల్లో ఫలితాలు విడుదల చేస్తున్నారు. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు, విద్యార్థులకు ర్యాంకులను ఆపాదిస్తూ తమ సంస్థలకు ఉత్తమ, అత్యధిక ర్యాంకులు వచ్చాయని టీవీలు, పేపర్లలో తప్పుడు ప్రకటనలు చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులను పక్కదారి పటిస్తున్నారని పాఠశాల విద్యాశాఖ గుర్తించింది. ఇలాంటి ప్రకటనలు చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులను ప్రైవేట్ విద్యాసంస్థలు పక్కదోవ పట్టిస్తున్నాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపింది. ర్యాంకుల పోటీల్లో విద్యార్థులకు మానసిక ఒత్తిడి పెరుగుతోందని విద్యాశాఖ చాలా వినతులు వచ్చాయని అధికారులు తెలిపారు. 


ఏడేళ్ల జైలు శిక్ష 


ఏపీ పబ్లిక్ పరీక్షలు యాక్ట్-1997 ప్రకారం మాల్ ప్రాక్టీస్, తప్పుడు ప్రకటనలు చేసే వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తామని అధికారులు అంటున్నారు. పదో తరగతి పరీక్షల్లో గ్రేడ్లకు బదులు  మార్కులతో  ఫలితాలు ప్రకటించనున్న కారణంగా ఆయా సంస్థలు ర్యాంకులతో తప్పుడు ప్రకటనలు చేయరాదని విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. విద్యాసంస్థలు ర్యాంకులతో ప్రకటనలు చేయడానికి వీల్లేదని నిషేధం విధించింది. ఒకవేళ ర్యాంకులు ప్రకటిస్తే చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. రాష్ట్రంలో ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలు ఈ వారంలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పేపర్ల మూల్యాంకనం పూర్తయింది. మార్కుల కంప్యూటరీకరణ పనుల్లో అధికారులు నిమగ్నం అయ్యారు. అయితే ఈ ఏడాది పరీక్షలు వివాదాల మధ్య జరిగాయి. మొదటి నుంచి పేపర్ల లీక్ , మాల్ ప్రాక్టీస్  గందరగోళం మధ్య పరీక్షలు నిర్వహించారు. మాల్ ప్రాక్టీస్ కు సంబంధించి అరెస్టులు, ప్రైవేట్ విద్యాసంస్థల అధినేతలపై కేసుల కూడా నడిచాయి.