AICTE Yashasvi Scholarship Scheme 2024: ఇంజినీరింగ్.. ఈ మాట వింటే ఇప్పుడు గుర్తుకొచ్చేది కేవలం కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కెరీరే. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రతి ఏడాది కంప్యూటర్, ఐటీ సంబంధిత సీట్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. మొత్తం సీట్లలో 60 శాతం వీటితోనే భర్తీ అవుతున్నాయి. ఇక కోర్ బ్రాంచ్‌ల పరిస్థితి దారుణంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం 'మేక్ ఇన్ ఇండియా' పేరిట మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా దేశాన్ని మార్చడానికి ప్రయత్నిస్తోంది. ఆయా రంగాల్లో నైపుణ్యాలు గల మానవ వనరుల అవసరం ఉంటుంది. కోర్ బ్రాంచ్‌లే ఈ ఉద్దేశాన్ని ముందుకు నడింపించగలవు. కానీ, విద్యార్థులు మాత్రం సాఫ్ట్‌వేర్ వైపు చూస్తున్నారు. ప్రముఖ కళాశాలలు ఒకవైపు కంప్యూటర్ సంబంధిత కోర్సుల్లో సీట్ల సంఖ్యను పెంచుకుంటూ పోతుంటే.. అదే కళాశాలల్లో కోర్ బ్రాంచీల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్లను కన్వీనర్ కోటా ఫీజుకే ఇస్తామని బతిమలాడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితిలో మార్పు తేవాలనే ఉద్దేశంతో కోర్ బ్రాంచ్‌లైన మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో ప్రతిభావంతుల్ని చేర్పించాలన్న ఉద్దేశంతో 'యంగ్ ఎచీవర్స్ స్కాలర్‌షిప్ అండ్ హోలిస్టిక్ అకడమిక్ స్కిల్స్ వెంచర్ ఇనిషియేటివ్(YASHASVI)' పేరిట పథకానికి అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) రూపకల్పన చేసింది.
ALSO READ: కంప్యూటర్ ఇంజినీరింగ్ కోర్సుల సీట్లు పెంపుపై JNTUH ఆందోళన- డేంజర్ అంటూ AICTEకి లేఖ
స్కాలర్‌షిప్ ఎంత మందికి?
ఇంజినీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ అన్నట్లుగా పరిస్థితి మారిపోవడంతో కోర్ ఇంజినీరింగ్ బ్రాంచీల్లో చేరేలా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఆ సంస్థ ఈ విద్యాసంవత్సరం(2024-25) నుంచి ఉపకార వేతనాలు మంజూరు చేయనుంది. విద్యార్థులు ఇంటర్ స్థాయిలో సాధించిన మార్కుల (మెరిట్) ఆధారంగా ఎంపిక చేయనుంది. దేశవ్యాప్తంగా 5 వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు, అలాగే 5 వేల మంది పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులను ఎంపిక చేసి ఉపకారవేతనాలు అందజేయనుంది.
తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం ఇంజినీరింగ్ విద్యార్థులకు 221, డిప్లొమా విద్యార్థులకు 167 స్కాలర్‌షిప్స్ మంజూరుచేశారు. ఇందులో తెలంగాణలో ఇంజినీరింగ్-71, డిప్లొమా-52 స్కాలర్‌షిప్స్ మంజూరుచేయగా.. ఏపీకి ఇంజినీరింగ్-150, డిప్లొమా-115 స్కాలర్‌షిప్స్ కేటాయించారు.
ఎవరు అర్హులు?
బీటెక్, డిప్లొమా మొదటి సంవత్సరంలో చేరిన వారు 'నేషనల్ ఇ-స్కాలర్‌షిప్' పోర్టల్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కేవలం కోర్ బ్రాంచ్‌లైన సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వం కూడా మిగిలిన బ్రాంచీల్లో విద్యార్థుల కంటే కోర్ బ్రాంచ్ విద్యార్థులకు 'ఫీజు రీయింబర్స్‌మెంట్' ఎక్కువగా ఇవ్వాలని యోచిస్తోంది. దీనిపై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.
స్కాలర్‌షిప్ ఎంతంటే?
ఎంపికైన ఇంజినీరింగ్ విద్యార్థులకు సంవత్సరానికి రూ.18,000; డిప్లొమా విద్యార్థులకు రూ.12,000 చొప్పున స్కాలర్‌షిప్ అందజేస్తారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు నాలుగేళ్లపాటు, డిప్లొమా విద్యార్థులకు మూడేళ్లపాటు ఈ ఉపకారం అందుతుంది.
అవసరమైన డాక్యుమెంట్లు..
దరఖాస్తు సమయంలో అభ్యర్థులకు మార్కుల మెమోలు (Marksheets), కళాశాల ఆఫర్ లెటర్ (College offer letter), ఆదాయ ధ్రువీకరణ పత్రం (Income Certificate), ఆధార్ కార్డు (Aadhar card) అవసరమవుతాయి. ఫోన్ నెంబరు తప్పనిసరిగా నమోదుచేయాల్సి ఉంటుంది.