దేశంలోని విద్యాసంస్థల్లో ఇకపై బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(BCA), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్(BBM) కోర్సులకు వచ్చే విద్యాసంవత్సరం (2024-25) నుంచి ఏఐసీటీఈ అనుమతులు తప్పనిసరి కానున్నాయి. ఈ మేరకు ఏఐసీటీఈ తన ముసాయిదా నివేదికలో స్పష్టం చేసింది. దీనిపై నవంబరు 17లోపు అభిప్రాయాలు పంపాలని కోరింది. ఇందుకు సంబంధించిన తుది నిబంధనలపై వచ్చే ఏడాది మార్చిలో హ్యాండ్‌బుక్‌ను విడుదల చేయనున్నారు. 


ఇప్పటివరకు బీసీఏ, బీబీఏ, బీబీఎం కోర్సులకు యూజీసీ (UGC) నిబంధనలకు అనుగుణంగా.. రాష్ట్ర ఉన్నత విద్యామండలి అనుమతులిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయా విశ్వవిద్యాలయాలు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) జారీ చేస్తాయి. ఇక నుంచి పాలిటెక్నిక్ డిప్లొమా, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ తరహాలోనే బీసీఏ, బీబీఏ, బీబీఎం కోర్సులకు ఏఐసీటీఈ నుంచి అనుమతులు పొందాలి. ఏఐసీటీఈ నిబంధనలనే పాటించాలి. 


టెక్నికల్, మేనేజ్‌మెంట్ కోర్సులకు సరైన ప్రమాణాలను అనుగుణంగా ఆయా కోర్సులకు కొత్త సిలబస్‌ను కూడా రూపొందించనున్నారు. త్వరలో దానిపై నిపుణుల కమిటీని నియమించనున్నారు. ఇప్పటివరకు ప్రతి సంవత్సరం అనుమతులు పొందాల్సి ఉండేది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మూడేళ్లపాటు అనుమతి ఇస్తారు. యూజీసీ, ఏఐసీటీఈ తదితర నియంత్రిత సంస్థలను మిళితం చేసి భారత ఉన్నత విద్యా కమిషన్(హెకీ)గా మార్చాలన్న ప్రతిపాదనపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఇకపై మూడేళ్లకు అనుమతులు ఇవ్వనున్నారని నిపుణులు చెబుతున్నారు.


మరిన్ని ఇంటిగ్రేటెడ్ కోర్సులు..
కొన్నిచోట్ల ఇప్పటికే అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు (BTech + MTech) నడుస్తున్న విషయం తెలిసిందే. అదే మాదిరిగా ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఇన్ ప్లానింగ్(M.Plan), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA), మాస్టర్ ఇన్ హోటల్‌ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ (MH & MCT), మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) కోర్సులకు అనుమతిస్తారు. దీనివల్ల విద్యార్థులకు ఒక ఏడాది సమయం ఆదా అవడమే కాకుండా విద్యార్థులు యూజీతో చదువు ఆపకుండా పీజీ కూడా చేస్తారన్నది ఏఐసీటీఈ ఉద్దేశంగా ఉంది.


➥ క్యూఎస్/టైమ్ ర్యాంకింగ్‌లో 1000 ర్యాంకులోపున్న విదేశీ విద్యాసంస్థలతో ఒప్పందం ద్వారా ట్విన్నింగ్ ప్రోగ్రామ్‌లను అందించవచ్చు. అంటే కొంతకాలం భారత్‌లో, మరికొంతకాలం విదేశాల్లో చదువుకోవచ్చు. కాకపోతే ఇక్కడున్న కళాశాలకు/వర్సిటీకి న్యాక్‌లో కనీసం 3.01 పాయింట్లు లేదా ఎన్‌బీఏలో వెయ్యికి 650 పాయింట్లు లేదా ఎన్‌ఐఆర్‌ఎఫ్(NIRF) ర్యాంకింగ్‌లో 200 లోపు ఉండటం తప్పనిసరి. 


➥ పాలిటెక్నిక్ సీట్లను ఇంజినీరింగ్‌గా, ఇంజినీరింగ్ సీట్లను పాలిటెక్నిక్ సీట్లుగానూ మార్చుకోవచ్చు. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని బీటెక్ సీట్లు వస్తాయని అంచనా. 


➥ 40 శాతం క్రెడిట్లను విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా చదివి పొందొచ్చు. వాటినీ పరిగణనలోకి తీసుకుంటారు.


ALSO READ:


ఓయూ ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ 'లేటరల్ ఎంట్రీ' ప్రవేశాలు..
డిప్లొమా అర్హత ఉండి, ఉద్యోగాలు చేస్తూ.. ఇంజినీరింగ్ చదవాలనుకునే వారికోసం 'బీటెక్‌ వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌' పేరుతో బీటెక్‌ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు తెలంగాణలోని 12 ఇంజినీరింగ్‌ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇటీవలే అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఉస్మానియా సహా పలు కాలేజీల్లో వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు ప్రవేశాలు కల్పించేందుకు (ఏఐసీటీఈ)అనుమతిని మంజూరు చేసింది. 
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...