తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు, కళాశాలల భవిష్యత్తుపై గత మూడేళ్లుగా నెలకొన్న సందిగ్ధతకు 'ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE)' ముగింపు పలికింది. పాలిటెక్నిక్ కోర్సులు గతంలో మాదిరిగానే యథావిధిగా నడుస్తాయని స్పష్టం చేసింది. ఇటీవల ఢిల్లీలో అన్ని రాష్ట్రాల సాంకేతిక విద్యాశాఖ అధికారులతో నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్(NCRF) విధానంపై నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని ఏఐసీటీఈ ఛైర్మన్ సీతారామ్ స్పష్టం చేశారు. బీటెక్ రెండేళ్లు పూర్తయిన తర్వాత చదువు మానేసే వారికి ఇచ్చే డిప్లొమా సర్టిఫికెట్‌కు, మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమాకు అసలు పొంతనే లేదని, పాలిటెక్నిక్ కోర్సులు యథాతథంగా ఉంటాయని, అవి ఇండస్ట్రియల్ పరిజ్ఞానాన్ని పెంచేందుకు అందిస్తున్న కోర్సులని తేల్చి చెప్పారు.
బీటెక్‌లో డిప్లొమా సర్టిఫికెట్‌తో ఉద్యోగాలు పొందే నైపుణ్యాలు సాధించలేరని, అది కేవలం మళ్లీ భవిష్యత్తులో బీటెక్ చదివేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని సీతారామ్ వివరించినట్లు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (SBTET) కార్యదర్శి పుల్లయ్య చెప్పారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలో 56 ప్రభుత్వ, 62 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. వాటిల్లో సుమారు 32 వేల సీట్లున్నాయి.
మూడేళ్ల క్రితం విడుదల చేసిన జాతీయ నూతన విద్యా విధానం-2020లో బీటెక్‌లో చేరి ఏడాది తర్వాత బయటకు వెళ్తే సర్టిఫికెట్, రెండేళ్ల తర్వాత వెళ్తే డిప్లొమా సర్టిఫికెట్ ఇస్తామని పొందుపరిచారు. దీంతో ఇక పాలిటెక్నిక్ కోర్సులు ఉండవని ఊహాగానాలు వినిపించాయి. గత ఏడాది కళాశాలలకు అనుమతుల ప్రక్రియకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ఏఐసీటీఈ నిర్వహించిన సమావేశంలో పలువురు పాలిటెక్నిక్ కళాశాలల ప్రతినిధులు ఈ విషయంపై అప్పటి ఛైర్మన్ సహస్రబుద్ధేను ప్రశ్నించారు. దానిపై చర్చిస్తున్నామని, ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన సమాధానమివ్వడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. తాజాగా నూతన ఛైర్మన్ అవన్నీ అపోహలేనని స్పష్టత ఇచ్చారు.
ALSO READ:
ఇంజినీరింగ్ విద్యార్థులకు 'ఇంటర్న్‌షిప్', ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే అవకాశం
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ (Internship) చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు డిసెంబరు 20న ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని బీటెక్ (B.Tech), ఎంటెక్ (M.Tech) చివరి సంవత్సరం చదివే విద్యార్థులతో.. ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9 తరగతులు చదివే విద్యార్థులతోపాటు, ఉపాధ్యాయులకు నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకోసం 6,790 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఇంజినీరింగ్ కళాశాలలతో అనుసంధానించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
పెరల్ అకాడమీలో డిజైన్ & మేనేజ్‌మెంట్ కోర్సులు, ప్రవేశాలు ఇలా
దేశంలోని పలు క్యాంపస్‌లో 2024-25 విద్యాసంవత్సరానికిగాను వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం పెరల్ అకాడమీ దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రవేశ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
దేశవ్యాప్తంగా 10 వేల విద్యాసంస్థలకు రుణాల జారీ లక్ష్యం: ఆక్సిలో ఫిన్‌సర్వ్
రాబోయే 5 సంవత్సరాలలో (2028 నాటికి) దేశవ్యాప్తంగా 10 వేల పాఠశాలలు, విద్యా సంస్థలకు రుణ నిధులు సమకూర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆక్సిలో ఫిన్‌సర్వ్ సంస్థ తెలిపింది. ఈ మేరకు డిసెంబరు 20న ప్రణాళికలను ప్రకటించింది. విద్యా సంస్థలు తమ సామర్థ్య పెంపుదల, ప్రాంగణాల విస్తరణ కోసం భూమి కొనుగోలు, బోధనా సౌకర్యాల ఆధునీకరణ, అధిక ఖర్చుతో కూడిన అప్పుల భర్తీకి సంబంధించిన అవసరాలను తీర్చడానికి ఆర్థిక సహాయం చేయనున్నట్లు పేర్కొంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.