మహేంద్రసింగ్‌ ధోనీ(Mahendra Singh Dhoni) కూల్‌ కెప్టెన్‌.. టీమిండియా(Team India)కు అత్యధిక ఐసీసీ ట్రోఫీ(ICC Trophies)లు అందించిన కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. అంతేనా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL )లో చెన్నైసూపర్ కింగ్స్‌కు 5 టైటిళ్లు అందించి అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. కెప్టెన్సీతో మ్యాజిక్‌ చేసి గెలవదు అనుకున్న ఎన్నో మ్యాచ్‌లను మలుపు తిప్పి గెలిచేలా చేయడంలో ధోనీ ప్రావీణ్యం అందరికీ తెలిసిందే. 40 ఏళ్ల వయసులోనూ గతేడాది చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలబెట్టి తాను ఎందుకు అంత విజయవంతమైన కెప్టెన్‌నో మరోసారి క్రికెట్‌ ప్రపంచానికి చాటి చెప్పాడు.


ఆర్సీబీ జట్టుకు ధోనీ మద్దతు


ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక సార్లు ట్రోపీలను గెలుచుకున్న ఘనట చెన్నై సూపర్ కింగ్స్‌కు దక్కిందంటే అది పూర్తిగా ఎం.ఎస్. ధోనీ చలవే. ఓవైపు ఐపీఎల్‌లో చెన్నై అయిదుసార్లు కప్పులు గెలిస్తే మరోవైపు ఐపీఎల్ లోని పలు జట్లు ఇప్పటి వరకు ఒక్కసారికూడా ట్రోపీని గెలచుకోలేదు. వాటిలో రాయల్ ఛాలెంజర్స్  బెంగళూరు జట్టు ఒకటి. ప్రతిసారి బెంగళూరు జట్టు హాట్ ఫెవరేట్‌గా బరిలోకి దిగడం.. ట్రోఫీ మాత్రం అందకుండా పోవడం జరుగుతూనే ఉంది. దీంతో ట్రోఫీ కోసం వేచి చూసి ఆర్సీబీ అభిమానుల కళ్లు కాయలవుతున్నాయి. కానీ టైటిల్ మాత్రం దక్కడం లేదు. ఇటీవల మహేంద్రసింగ్ ధోని ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో ధోనీకి బెంగళూరు అభిమాని నుంచి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.  వచ్చే ఐపీఎల్ టోర్నీలో ఆర్సీబీ జట్టు విజయానికి మద్దతు ఇవ్వాలని ఆ అభిమాని ధోనీని కోరాడు. 


బెంగుళూరు రావాలని ధోనికి రిక్వస్ట్


అలాగే ధోనిని బెంగళూరు జట్టులోకి రావాలని, తమ కోసం ఒక ట్రోఫీ గెలవాలని కూడా కోరాడు. అభిమాని ప్రశ్నకు నవ్వుతూ సమాధానమిచ్చిన ధోని ఆర్సీబీ జట్టు చాలా పటిష్టంగా ఉందని అన్నాడు. "మీరు చూడాల్సింది ఏమిటంటే.. ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరగదు. ఐపీఎల్ లో మొత్తం 10 జట్లు, పూర్తి ఆటగాళ్లను కలిగి ఉంటే చాలా బలమైన జట్లే. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే గాయాల వల్ల కొంతమంది ఆటగాళ్లు మ్యాచ్‌లకు దూరమైనప్పుడు ప్రభావం పడుతుంది. ప్రస్తుతానికి నా సొంత జట్టులో నేను ఆందోళన చెందడానికి చాలా విషయాలు ఉన్నాయి. ప్రతి జట్టు విజేతగా నిలవాలని నేను శుభాకాంక్షలు చెబుతాను" అని ధోనీ అన్నాడు. ఐపీఎల్‌లో ఛాంపియన్‌గా నిలవడానికి ప్రతి జట్టుకు మంచి అవకాశం ఉంటుందని కూడా ధోనీ అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


ఇటీవలే భారత జట్టుకు అత్యధిక ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్‌గా గుర్తింపు పొందిన మహేంద్ర సింగ్ ధోనీకి బీసీసీఐ అరుదైన గౌరవం కల్పించింది. ధోనీ జెర్సీ నంబర్ 7 రిటైర్ అవుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అంటే ఇక మీదట భారత క్రికెటర్ ఎవరూ ఏడో నెంబర్ జెర్సీతో బరిలోకి దిగడం కుదరదు. సచిన్ టెండుల్కర్ తర్వాత ఈ గౌరవం ధోనీకి మాత్రమే దక్కింది. సచిన్ రిటైర్మెంట్ తరువాత జెర్సీ నంబర్ 10 రిటైర్ అవుతున్నట్లు గతంలోనే బీసీసీఐ ప్రకటించింది. ఇక ఇప్పుడు ‘జెర్సీ 7’కు ఈ గౌరవం దక్కింది. భారత క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా ధోనీకి ఈ అరుదైన గౌరవం ఇచ్చింది. అంటే ఇక పై భారత జట్టులోకి వచ్చే కొత్త కుర్రాళ్లెవరూ నంబర్ 7, నంబర్ 10 జెర్సీలను ఎంపిక చేసుకోలేరు.