Engineering Colleges in Telangana: తెలంగాణలో కొత్తగా 200 ఇంజినీరింగ్ కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(AICTE) ఆయా కాలేజీలకు అనుమతులు మంజూరు చేసింది. వీలిలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలతో పాటు 10 డీమ్డ్ వర్సిటీలు లేదా వాటి ఆఫ్ క్యాంపస్‌లు ఉన్నాయి. కొత్త కళాశాలల ఏర్పాటుకు ఆయా యూనివర్సిటీలు ఏఐసీటీఈకి దరఖాస్తుకున్నాయి. తాజాగా ఏఐసీటీఈ వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్‌లోని దేశముఖ్ వద్ద విజ్ఞాన్ డీమ్డ్ విశ్వవిద్యాలయం(గుంటూరు) ఆఫ్ క్యాంపస్ ఏర్పాటుకు ఏఐసీటీఈ ఆమోదం తెలిపింది. ఇక కోస్గిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ ఏడాది నుంచి బీటెక్ కోర్సు ప్రారంభించేందుకు అనుమతి లభించింది. ఈసారి మూడు బ్రాంచీలతో కోర్సు ప్రారంభంకానుంది. 


కొత్తగా 20,500 ఇంజినీరింగ్ సీట్లు..
రాష్ట్రంలో ఒకపక్క ఇంజినీరింగ్ కాలేజీల సంఖ్య భారీగా పెరగ్గా.. ఆ మేరకు సీట్ల సంఖ్య కూడా భారీగా పెరగనుంది. ముఖ్యంగా డిమాండ్‌ ఉన్న కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో ఏకంగా 20,500 సీట్లు పెరగనున్నాయి. అయితే పెరగిని ఈ సీట్లు కేవలం జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలోని కళాశాలల్లోనివి మాత్రమే కావడం గమనార్హం. ఇక ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీల్లో కలిపితే సీట్ల సంఖ్య మరింత పెరుగుతాయి.  


10 వేలు అనుకుంటే.. 20 వేలు దాటిపోయింది..
ఏఐసీటీఈ కొత్త కాలేజీలకు అనుమతిస్తే పది వేల వరకు కొత్త సీట్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు మొదట భావించారు. అయితే ఏఐసీటీఈ అనుమతుల తర్వాత చూస్తే ఆ సంఖ్య రెట్టింపు అయింది. రాష్ట్రంలో జులై 4న కౌన్సెలింగ్ ప్రారంభమైంది. జులై 12 వరకు రిజిస్ట్రేషన్ గడువు ఉంది. వీరికి జులై 6 నుంచి 13 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినవారు జులై 8 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే జులై 6 నాటికి కళాశాలలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. ఇందుకోసం జేఎన్‌టీయూహెచ్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 


అలా అయినా అనుమతివ్వండి.. 
బీటెక్‌ సీట్లకు భారీగా అనుమతిస్తే.. ప్రభుత్వం అదే స్థాయిలో విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. అయితే నాన్‌ రీయింబర్స్‌మెంట్‌ పేరిట అనుమతివ్వాలని కళాశాలల యాజమాన్యాలు ఇప్పటికే కోరాయి. అప్పుడు ప్రభుత్వంపై భారం పడదని, ఆర్థిక స్తోమత ఉన్న విద్యార్థులే ఆయా సీట్లను ఎంచుకుంటారని తెలిపాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి మాత్రం కోర్‌ బ్రాంచీలను ప్రోత్సహిస్తామని, అంతా సీఎస్‌ఈ చదివితే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ ఇంజినీర్లు ఎక్కడ నుంచి వస్తారని ఇటీవల యాజమాన్యాల సమావేశంలో ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది తేలాల్సి ఉంది.  


కంప్యూటర్ కోర్సులకే డిమాండ్..
బీటెక్ కోర్సుల్లో ఎక్కువ డిమాంగ్ కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత కోర్సులకే ఉంటుంది. దీంతో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ బ్రాంచీల్లో కన్వీనర్‌ కోటా సీట్లు సగం కూడా నిండలేదు. గతేడాది మూడు కోర్‌ బ్రాంచీల్లో 12,751 సీట్లుండగా.. అందులో కేవలం 5,838 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇక మేనేజ్‌మెంట్ కోటాలో చేరే వారూ తగ్గిపోయారు. ఆ సీట్లను కూడా  కలిపితే సీట్ల భర్తీ 40 శాతానికి మించదు. వనపర్తి, సిరిసిల్ల, మహబూబాబాద్, పాలేరులోని జేఎన్‌టీయూహెచ్‌ కళాశాలల్లోని కోర్‌ బ్రాంచీల్లో చేరేవారు అతి స్వల్పంగా ఉన్నారు. ఆ బ్రాంచీల్లో చదివితే ఉద్యోగావకాశాలు తక్కువని, ఒకవేళ దొరికినా తక్కువ వేతనం ఉంటుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తుండమే ఇందుకు కారణం. 


ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..