JNTU Data Center: జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (JNTU)-హైదరాబాద్ త్వరలో రాష్ట్రంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌కు నిలయం కానుంది. యూనివర్శిటీలో రూ.5 కోట్లతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అదానీ కనెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా అదానీ గ్రూప్ అందజేయనున్న విరాళంతో ఈ కేంద్రం ఏర్పాటు కానుంది. దీంతో అత్యాధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానంతో విద్యార్థులకు బోధన అందిస్తున్న జేఎన్‌టీయూ మరో మైలురాయికి చేరుకోనుంది. ఇప్పటి వరకు ఐఐటీ మద్రాస్‌లో మాత్రమే డేటా సెంటర్ ఉంది. 


ఈ కొత్త డేటా సెంటర్‌లో విద్యార్థులు, ప్రొఫెసర్లు సంయుక్తంగా చేసే పరిశోధనలు, చేస్తున్న అధ్యయనాల వివరాలన్నీ భద్రంగా ఉంటాయి. సమాచార కేంద్రం నిర్వహణ, శిక్షణ వ్యవహారాలను ప్రొఫెసర్లు, విద్యార్థులకు అదానీ కనెక్స్ సంస్థ ప్రతినిధులు అవగాహన కల్పిస్తారు. సంస్థ విశ్వవిద్యాలయ అధ్యాపకులకు ఐదేళ్లపాటు శిక్షణ ఇచ్చి కేంద్రాన్ని యూనివర్సిటీకి అప్పగిస్తుంది. హైదరాబాద్ క్యాంపస్ సహా యూనివర్సిటీ పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలలు, ఇంజినీరింగ్ కళాశాలలకు సంబంధించిన అధ్యయన సమాచారం, ఇతర వివరాలు ఈ డేటా సెంటర్‌లో అందుబాటులో ఉంటాయి.  ప్రస్తుతం, విశ్వవిద్యాలయం మరియు దాని విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని హోస్ట్ చేయడానికి విశ్వవిద్యాలయం దాని చిన్న సర్వర్‌లపై ఆధారపడుతోంది. సమాచారాన్ని భద్రపరచడమే కాకుండా, విశ్వవిద్యాలయ విద్యార్థులు పరిశోధన కార్యకలాపాలను చేపట్టేందుకు వీలుగా కంప్యూటర్-ల్యాబ్ ఏర్పాటు చేయబడుతుంది. 


ఈ విభాగాల్లో పరిశోధనలు..
ప్రస్తుతం జేఎన్‌టీయూ పరిధిలోని కళాశాలల్లో సివిల్, మెకానికల్, ఇంజినీరింగ్ వంటి సంప్రదాయ విభాగాలతో పాటు కంప్యూటర్ సైన్స్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థులకు వచ్చిన ఆలోచనలు.. ఇతర వర్సిటీల్లో చదువుకుంటున్న వారికీ వచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ రెండు పరిశోధనల మధ్య సారూప్యతలుంటే ముందుగా పరిశోధన చేసిన వారికే ప్రాధాన్యం ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులను డేటా సెంటర్ ద్వారా అధిగమించవచ్చని జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ అభిప్రాయ పడుతున్నారు.


ALSO READ:


ఎంఫిల్‌ ప్రవేశాలు నిలిపేయండి, యూనివర్సిటీలకు UGC కీలక ఆదేశాలు
దేశంలోని యూనివర్సిటీలు తక్షమణే ఎంఫిల్‌(Master of Philosophy) డిగ్రీ ప్రవేశాలు ఆపేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) ఆదేశించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎంఫిల్ డిగ్రీకి యూజీసీ గుర్తింపు లేదని, విద్యార్థులు ఈ కోర్సులో చేరవద్దని స్పష్టం యూజీసీ చేసింది. అంతేకాకుండా 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఫిల్‌ ప్రవేశాలు నిలిపివేయాలంటూ అన్ని యూనివర్సిటీలను ఆదేశించింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని యూజీసీ తెలిపింది. ఎంఫిల్‌ ప్రవేశాల కోసం పలు యూనివర్సిటీలు దరఖాస్తులు కోరుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఎంఫిల్‌ అనేది గుర్తింపు పొందిన డిగ్రీ కాదని యూజీసీ పేర్కొంది. ఈ ప్రోగ్రామ్‌ను ఉన్నత విద్యా సంస్థలు నిర్వహించరాదంటూ యూజీసీ నిబంధనలు-2022 రెగ్యులేషన్‌ నంబర్‌ 14 స్పష్టంగా చెబుతోంద తాజా నోటీసులో యూజీసీ పేర్కొంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...